నాలుగు నెలల్లో 82 కిలోల గంజాయి స్వాధీనం
ఒంగోలు టౌన్: గత నాలుగు నెలల్లో భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా అనేక మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు 82.517 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీసుస్టేషన్లలో ఇప్పటి వరకు నమోదైన 6 గంజాయి కేసుల్లో 25 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 9.87 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైలు మార్గం ద్వారా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో 10 కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 72.647 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమాజానికి పెద్ద ప్రమాదమని పేర్కొన్నారు. యువతను మత్తు పదార్ధాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉందన్నారు. ఈ దిశగా జిల్లా పోలీసు శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందని, రైల్వే మార్గాలు, ఆర్టీసీ బస్టాండ్లు, లాడ్జీలు, అనుమానాస్పద ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయిని వినియోగించినా, విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు తెలియజేయాల్సిందిగా కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు.
నాలుగు నెలల్లో 82 కిలోల గంజాయి స్వాధీనం


