జీవితాలతో ఆటలు
104 ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలు సిబ్బంది కొరతతో అదనపు భారం అరకొర వేతనాలతో అవస్థలు చెప్పా పెట్టకుండానే జీతాల్లో కోతలు మహిళా ఉద్యోగులకు సైతం సెలవులు ఇవ్వకుండా వేధింపులు భవ్వ సర్వీసెస్‌కు ప్రభుత్వ పెద్దల అండ యాజమాన్యం వైఖరిపై మండిపడుతున్న ఉద్యోగులు
జీతాల్లో కోతలు..
మారుమూల పల్లెల్లోని ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ అండగా నిలుస్తున్న ఆపద్బాంధవులకు కష్టమొచ్చింది. గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపే ఉద్యోగులకు ఆపదొచ్చింది. పల్లె సంజీవని 104 అంబులెన్స్ ఉద్యోగులతో నిర్వహణా సంస్థ చెలగాటమాడుతోంది. అరకొర సిబ్బంది..రోజుకు పది గంటలకు పైగా విధులు..అదనపు పని ఒత్తిడి. కనీసం సెలవులు ఇవ్వకుండా వేధింపులు.. మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణం. ఇదేమని అడిగిన వారిపై లేనిపోని నిందలేసి వేటు వేస్తోంది. ప్రభుత్వ పెద్దల అండదండలతో భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ సిబ్బంది రోడ్డెక్కారు. యాజమాన్యం వేధింపులను ఆపాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
భవ్య యాజమాన్యం వేధింపులు ఆపాలి
భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు అన్ని రకాలుగానూ దగా చేస్తోంది. పూర్తి వేతనాలను చెల్లించకపోగా ప్రతినెలా రూ.500 కోత విధించడం దారుణం. అసలే అరకొర జీతాలతో ఉద్యోగులు కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు పెంచడానికి బదులు కోతలు విధించడం దుర్మార్గం. ఉద్యోగుల పే స్లిప్పులను ఇవ్వక పోవడం నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ తరహా వేధింపులను యాజమాన్యం ఆపాలి. లేకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం.
– అబ్బూరి శ్రీనివాసరావు, ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
మహిళా ఉద్యోగుల హక్కులను కాపాడాలి
జిల్లాలోని ఏడుగురు మహిళా ఉద్యోగులు 104లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ మహిళలకు ప్రత్యేక సెలవులు ఇస్తారు. కానీ 104లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఎలాంటి సెలవులు ఇవ్వకపోవడం విచారకరం. ఒకవేళ సెలవు పెట్టినా ఇంటి వద్ద నుంచి పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. మహిళా సాధికారిత గురించి చెబుతున్న ప్రభుత్వం 104లో పనిచేస్తున్న మహిళల ప్రాథమిక హక్కులను కాపాడాలి.
– మాకం లక్ష్మి, డేటా ఎంట్రీ ఆపరేటర్
ఒంగోలు టౌన్: జిల్లాలో 729 గ్రామాలకు గాను ‘104’ వాహనాలు కేవలం 47 మాత్రమే ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) ఉంటారు. మొత్తం మీద 94 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 88 మంది మాత్రమే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ 104 కాంట్రాక్ట్ చేపట్టింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ఉద్యోగులలో 10 శాతం బఫర్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు బఫర్ ఉద్యోగులను నియమించలేదు.
అదనపు పనిభారంతో సతమతం...
సరిపడా సిబ్బంది లేకపోయినప్పటికీ భవ్య యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఎంఎంయూ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపిస్తోంది. ఒక ఉద్యోగి చేత ఇద్దరు ఉద్యోగుల పనిని చేయించుకుంటోందని మండిపడుతున్నారు.
రెండు వాహనాలకు ఒక డ్రైవర్‌కు డ్యూటీ వేయడం, ఒక డీఈఓతో రెండు వాహనాల డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. రోగులకు సేవలందించడంతో పాటుగా ప్రతి రోజూ వివిధ రికార్డులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరు రకాల రికార్డులు పూర్తి చేయడమే కాకుండా ఎంఓ యాప్‌ను కూడా ఆన్‌లైన్ చేయాలి. దీనికితోడు ఇటీవల భవ్య యాప్ తీసుకొచ్చి దానిని కూడా ఆన్‌లైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు అసలు పనికంటే కొసరు పనే ఎక్కువైపోయిందని వాపోతున్నారు.
సెలవులివ్వకుండా హక్కులు హరి...
కొంతమంది ఉద్యోగులకు ఇంటి వద్ద తల్లిదండ్రులు ఉన్నారు. భార్య, బిడ్డల బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. స్వయంగా అనారోగ్యం పాలవుతుంటారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా 104 ఉద్యోగులకు యాజమాన్యం సెలవులు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల సమయంలో కూడా సెలవులివ్వకుండా వేధింపులకు పాల్పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సెలవు పెట్టినప్పటికీ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. సెలవు రోజు వేతనం మాత్రం కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల హక్కులు సరే మానవ హక్కులను కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీతంలో రూ.500 కోత...
గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించిన అరవిందో ఇచ్చిన జీతాల కంటే ప్రస్తుతం భవ్య యాజమాన్యం తక్కువ జీతాలు చెల్లిస్తోంది. ఇస్తున్న అరకొర జీతాల్లో నుంచి ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలకు రూ.500 కోత విధిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు కోత విధిస్తున్నారో, ఎవరు విధిస్తున్నారో సమాధానం చెప్పేవారే లేకుండా పోవడంతో 104 ఉద్యోగులు దిక్కులు చూస్తున్నారు. ఏడు నెలలుగా ఉద్యోగులకు పే స్లిప్పులు ఇవ్వకుండా యాజమాన్యం దాగుడుమూతలు ఆడుతోంది. గతంలో ఇచ్చినట్లుగానే భవ్య యాజమాన్యం కూడా జీతాలు ఇస్తుందని అధికారులు ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఈఎస్‌ఐ, పీఎఫ్‌లో యాజమాన్యం వాటా చెల్లించాల్సి ఉంది. కానీ 104 ఉద్యోగుల నుంచి కంపెనీ వాటా, ఉద్యోగి వాటా రెండూ వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు అభద్రతకు గురవుతున్నారు.
ప్రశ్నిస్తే వేటే...
భవ్య యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలన్నిటినీ యథేచ్చగా ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులకు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని, చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దతలకాయల మద్దతుతో రెచ్చి పోతున్న యాజమాన్యం వైఖరిని ప్రశ్నించడం నేరమవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి అధికారిని కలవడానికి ప్రయత్నించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద వేధింపులకు దిగినట్టు సమాచారం. సదరు నాయకుడు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సెలవులో ఉన్నప్పుడు తనిఖీ పేరుతో వెళ్లిన అధికారి చేసిన హంగామా చూసి ఉద్యోగుల విస్తుపోయారు. 104 వాహనంలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద వేటు వేయడంపై 104 ఉద్యోగుల యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
జీవితాలతో ఆటలు
జీవితాలతో ఆటలు


