విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకోం
● కార్మిక సంఘాల హెచ్చరిక
ఒంగోలు టౌన్: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేది లేదని చెబుతూనే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిలో ప్రయత్నాలు చేస్తోందని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరు రంగారావు విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రూ.11 వేల కోట్ల నిధులు ఇచ్చినట్లు గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం 4 వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగించిందని, మూడు నెలలుగా వేతనం ఇవ్వకుండా ఆపేయడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి కార్మికులను ఏకం చేసి పోరాడుతామన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఎస్డీ సర్దార్, పేరయ్య, శేషయ్య, రాంబాబు, రమేష్, తంబి శ్రీనివాసరావు, బీవీ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


