కూటమి నేతలకే రుణాలు
బేస్తవారిపేట: కూటమి ప్రభుత్వం పథకాలకు అర్హతలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెట్టే అరకొర పథకాలు తమ పార్టీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలకే దోచిపెడుతోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కార్పొరేషన్ రుణాలు ఇస్తున్నట్లు ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రుణాల మంజూరులో నిజమైన లబ్ధిదారులకు ఈ పథకం అందనంత దూరంలో ఉంది. కూటమి నేతలు, కార్యకర్తలకే రుణాలన్నీ మంజూరు చేసే ఎత్తుగడ సాగుతోంది.
ఇంటర్వ్యూలు లేకుండానే...
అరకొరగా ఉన్న వివిధ కార్పొరేషన్‌ల రుణాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. జిల్లాలో ఎక్కువ శాతం మండలాల్లో ఇవేమీ జరుగలేదు. కొన్ని మండలాల్లో తూతూమంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. టీడీపీ నాయకులు చెప్పిన దరఖాస్తుదారుల గృహాల వద్దకు వెళ్లి పరిశీలించారు. మిగిలిన దరఖాస్తులను అటకెక్కించారు. విషయం తెలుసుకుని తమ దరఖాస్తులు పరిశీలించాలని కోరుతున్నా సరైన సమాధానం చెప్పడం లేదని అర్జీదారులు వాపోతున్నారు.
విస్తృత ప్రచారం:
నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్ ఇస్తాం, ఆర్థికంగా స్థిరపడేందుకు రుణాలు మంజూరు చేస్తున్నామని విస్తృత ప్రచారం కల్పించారు. దరఖాస్తులు పెట్టుకోవాలని అధికారులతో పత్రిక ప్రకటనలు, సచివాలయాల్లో ఊదరగొట్టారు. ఇప్పుడు వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం తమ పార్టీ వారికే రుణాలు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. రాజకీయ అండలేని నిరుద్యోగుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని దోచుకునేందుకు దళారులు తయారయ్యారు. రుణాలు ఇప్పిస్తామంటూ దరఖాస్తుదారుల నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. తాము చెబితేనే లోన్ వస్తుందని కూటమి నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత ఉన్న అందరికీ రుణాలు మంజూరు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
కార్పొరేషన్‌ల రుణాలన్నీ కూటమి నేతలు, కార్యకర్తలకే సిఫార్సుల మేరకు రుణాల మంజూరు ఇంటర్వ్యూలు లేకుండానే లబ్ధిదారుల ఎంపిక ఆందోళనలో నిరుద్యోగ యువత


