ఈదురుగాలుల బీభత్సం
సాక్షి నెట్‌వర్క్:
జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షం బొప్పాయి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి జిల్లాలోని దర్శి, కురిచేడు, పొదిలి మండలాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
● దర్శి మండలంలోని చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం గ్రామాల్లో బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మండలంలో సుమారు 50 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. ఆరుగాలం పండించిన పంట కళ్లెదుటే నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి కల్లాలో ఉన్న మిరపకాయలు, పందిర్లలో ఉన్న పొగాకు కూడా తడిసి ముద్దయింది. మండలంలోని జముకులదిన్నె గ్రామం వద్ద భారీ వృక్షం నేలకూలింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
● పొదిలి మండలంలో అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. మండలంలోని చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి, మల్లవరం గ్రామాల్లో చేతికి వచ్చిన బొప్పాయి నేలకొరిగింది. పంట బాగా పండి మంచి కాయలతో కళకళలాడుతున్న సమయంలో అకాల వర్షం తీరని నష్టం మిగిల్చిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మండలంలో సుమారు 140 ఎకరాల్లో బొప్పాయి సాగు చేయగా 90 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతింది. ఎకరాకు రూ.2 లక్షల మేరు నష్టం వాటిల్లిందని రైతులు బొనముక్కల రామిరెడ్డి, మారం సుబ్బారెడ్డి, సింగంరెడ్డి పెద్దిరెడ్డి, కామిరెడ్డి వెంకటరామిరెడ్డి, పెద్దిరాజు, వెంకటరెడ్డి వాపోయారు.
● పొదిలి మండలం రామాపురం జగనన్న కాలనీ సమీపంలో విద్యుత్ స్తంభంపై పిడుగు పడింది. పిడుగు విద్యుత్ పోలుపై పడటంతో పోలు పైభాగం విరిగికిందపడింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
● కురిచేడు మండలం బోదనంపాడులో గురువారం సాయంత్రం వీచిన పెనుగాలులకు వేపచెట్టు రోడ్డుపై విరిగి పడింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
● పొదిలి పట్టణంలో గురువారం సాయంత్రం వీచిన గాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్‌లో విద్యుత్ స్తంభం ఎల్‌జీ షోరూంపై పడింది. స్థానిక ఎన్‌ఏపీ పంప్ హౌస్‌లో పెద్ద వేపచెట్టు నేలకొరిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
అకాల వర్షానికి వందల ఎకరాల్లో
నేలకొరిగిన బొప్పాయి
పంట చేతికొచ్చే సమయంలో
నేలకొరగడంతో రైతుల కన్నీరుమున్నీరు
ఈదురుగాలుల బీభత్సం


