ఆలయ పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా ఉండాలి
త్రిపురాంతకం: బాలాత్రిపురసుందరీదేవి, పార్వతి త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల పరిసర ప్రాంతాలన్నీ భక్తులకు అసౌకర్యంగా కలగకుండా పరిశుభ్రంగా ఉంచాలని దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఆదేశించారు. త్రిపురాంతకం ఆలయాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయాలు పురాతన రాతి నిర్మాణాలైనందున ఎక్కడా రంగులు వేయరాదన్నారు. గతంలో వేసిన రంగులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి నూతన నిర్మాణాలు జరగాలన్నా, ప్రతిష్ఠలు చేయాలన్నా దేవదాయ శాఖ అనుమతించాల్సి ఉందన్నారు. దాతల ద్వారా జరిగినా ముందస్తు అనుమతులు అవసరమన్నారు. దాతల పేర్లుతో ఉన్న నేమ్ ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయరాదన్నారు. అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్నారు. నూతనంగా నిర్మించిన దక్షిణ గోపురంలో గ్రానైట్ పరుపు బండలు వేయడంపై రామచంద్రమోహన్ ప్రశ్నించారు. ఈయన వెంట ఆలయాల ఈఓ అనిల్ కుమార్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ ఐవీ సుబ్బారావు, అర్చకులు ప్రసాదశర్మ, విశ్వనారాయణశాస్త్రి ఉన్నారు. ఆలయాల వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికి పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించారు.


