వైపాలెంలో టీడీపీ ఫ్లెక్సీల రగడ
టీడీపీలో ఒక వర్గానికి చెందిన వారి ఫ్లెక్సీల తొలగింపు పనిలో పనిగా వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు కూడా
యర్రగొండపాలెం: టీడీపీలో ఒక వర్గం వారు వేయించిన ఫ్లెక్సీలను నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదేశాలతో తొలగించిన ఘటన యర్రగొండపాలెంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీలో ఉన్న ఒక వర్గానికి చెందిన వారు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం రాత్రి పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో టీడీపీ సీనియర్ నాయకుడు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర ఫొటోలు మాత్రమే ఉన్నాయి. అందులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎరిక్షన్‌బాబు ఫొటోలు లేకపోవడంతో ఆ నాయకుడికి చిర్రెత్తి పోయింది. తన ఫొటోలు లేని ఫ్లెక్సీలు తొలగించాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్లుంది..వెంటనే వారు పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆగమేఘాలపై పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య రవీంద్ర వర్గీయులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు తన సిబ్బందితో తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. పనిలో పనిగా వైఎస్సార్ సీపీ వర్గీయులు వేయించిన కొన్ని ఫ్లెక్సీలను కూడా తొలగించారు. ఇదేమిటని టీడీపీ వర్గీయులు ప్రశ్నిస్తే అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని, పోలీసుల ఆదేశాల మేరకు అనుమతిలేని ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి బదులిచ్చినట్లు వారు తెలిపారు. ఎరిక్షన్‌బాబు వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎందుకు తొలగించడంలేదని వారు నిలదీయడంతో ముందుగా 10/12 సైజ్‌లోపు ఉన్న ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని, ఆ సైజ్‌కంటే పెద్దగా ఉన్నవాటిని రేపు తొలగిస్తామని చెప్పాడని వారు తెలిపారు. ఆగమేఘాలపై ఫ్లెక్సీలు ఎందుకు తొలగింపచేస్తున్నారని ఎస్సై పి.చౌడయ్యను ప్రశ్నిస్తే.. ఫ్లెక్సీలు తొలగించే విషయంలో పోలీసుల జోక్యం లేదని, ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు తొలగిస్తున్నారో తనకు తెలియదని చెప్పారు. ఈ విషయం గురించి పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని, ఈ ఫ్లెక్సీలను తొలగించే అధికారం పంచాయతీకి ఉందని బదులిచ్చారు. ఫ్లెక్సీల తొలగింపుపై రాత్రి 8 గంటల సమయంలో టీడీపీలోని మన్నె రవీంద్ర వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎరిక్షన్ బాబు ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను కూడా తొలగించి ఆ తరువాత తమ ఫ్లెక్సీలు తొలగించాలని పట్టుబట్టారు.
వైపాలెంలో టీడీపీ ఫ్లెక్సీల రగడ


