బోధపడని ప్లాన్!
‘పది’ ప్రణాళికపై గందరగోళం వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలుకు ఇతర శాఖలు యాక్షన్ ప్లాన్ మానిటరింగ్‌కు ఇన్చార్జుల ఏర్పాటు ఇతర శాఖలకు పెత్తనం ఇవ్వడంపై ఆగ్రహాలు సంబంధంలేని వ్యక్తుల పర్యవేక్షణపై వ్యతిరేకత ఉపాధ్యాయులను అవమానించడమేనంటున్న సంఘాలు
మరో మూడు నెలల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళిక గందరగోళంగా మారింది. డిసెంబర్ మొదటి వారానికి సిలబస్ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉంది. ఒక వైపు బోధనేతర కార్యక్రమాల్లో పడిన ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్ పూర్తి చేయలేకపోయారు. మరో వైపు పలు రకాల యాప్‌లతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా వంద రోజుల ప్రణాళిక అమలు పర్యవేక్షణనను విద్యాశాఖకు సంబంధంలేని వ్యక్తులకు అప్పజెప్పడం వివాదాస్పదంగా మారింది. దీనిని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా శాఖపై వారి పెత్తనం ఏంటని మండిపడుతున్నారు.
ఒంగోలు సిటీ: జిల్లాలోని 364 వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 17,298 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 8 మున్సిపాలిటీ పాఠశాలలో 524 మంది, 249 జిల్లా పరిషత్ హైస్కూల్లో 11,522 మంది, గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ నాలుగు స్కూళ్లలో 43 మంది, 20 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 1,821 మంది, 22 ఎయిడెడ్ పాఠశాలల్లో 372 మంది, 28 కేజీబీవీ పాఠశాలల్లో 1,078 మంది, 6 ఏపీ ఎంఎస్ పాఠశాలల్లో 4,88 మంది, 11 ఏపీఎస్ డబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాలల్లో 8,34 మంది, 9 ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ స్కూళ్లలో 258 మంది, నాలుగు బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 మంది, 3 ఏపీఆర్‌ఎస్ పాఠశాలల్లో 211 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. అంతేకాకుండా 272 ప్రైవేట్ పాఠశాలల్లో 11,882 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.
గందరగోళంగా యాక్షన్ ప్లాన్ అమలు
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. అయితే అమలుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం విడుదలజేసిన ప్రణాళిక గందరగోళానికి గురిచేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యాశాఖ ఉపాధ్యాయులకు బోధన కంటే ఇతర పనులు అప్పగించింది. దీంతో సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు వారు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే మూల్యాంకనం, మార్కుల అప్‌లోడ్ చేయడంతోనే వారికి సమయం అయిపోతోంది. భారం ఎక్కువై ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు ఈ ప్రణాళికను అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒక వైపు పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తి చేయలేక, మరో వైపు వందరోజుల ప్రణాళిక పటిష్టంగా అమలు చేయలేక అవస్థలు పడుతున్న టీచర్లకు ప్రభుత్వ నిర్ణయం తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. విద్యాశాఖతో సంబంధం లేని వ్యక్తులకు ఈ ప్రణాళిక అమలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. స్లిప్ టెస్టుల నిర్వహణ, మార్కుల నమోదు, ఉపాధ్యాయుల హాజరు ఇలా పలు రకాల అంశాల నమోదు, పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యేంత వరకు పర్యవేక్షించేందుకు వివిధ శాఖల అధికారులు ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఇన్‌చార్జ్‌ల కనుసన్నుల్లో జరుగుతుందని పేర్కొంటుండడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
వివిధ శాఖలు అధికారులు ఇలా..
యాక్షన్ ప్లాన్ అమలు చేయడానికి ఇన్చార్జులుగా రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య, ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయం, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ శాఖలో పనిచేసే అధికారులను ఇన్చార్జులుగా నియమించింది. వీరంతా కలిసి మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి వంద రోజుల ప్రణాళిక అమలు అంశాన్ని పూర్తిగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్లిప్ టెస్టులు, ఉపాధ్యాయుల హాజరు, 10లో షైనింగ్, రైజింగ్ స్టార్లుగా విభజించి పాఠాలకు బోధిస్తున్నారా లేదా అంశాన్ని రోజూ పరిశీలించాలి. ఉపాధ్యాయుల హాజరు నమోదు, శని ఆదివారాల్లో ఇతర సెలవుల జిల్లాల్లో తరగతులు నిర్వహిస్తున్నారా? లేదా? అని చూడాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంటుంది.
మా వాళ్లు ఉండగా వారితో పనేంటి..
యాక్షన్ ప్లాన్ అమలుకు ఇతర శాఖల అధికారులు నియమించడంపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ప్రతి మండలానికి ఎంఈఓ 1, 2 లతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న డిప్యూటీ డీఈవోలు, ప్రతి పాఠశాలల హెచ్‌ఎంలు, సీఆర్‌పీ లు ఉన్నారు. వీళ్లు ఉండగా వేరే శాఖల వారిని ఇన్చార్జులుగా నియమించడం ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయులను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాల విద్య అమలు తీరుపై వీరికి ఏ విధంగా అవగాహన ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
ఇతర శాఖల పెత్తనం తగదు
వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యాశాఖ నిర్ణయాలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడి గురిచేస్తున్నాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఆంక్షలు విధించడం అశాసీ్త్రయం. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తుంటే ఇతర శాఖల అధికారులను తనిఖీల పేరుతో ప్రయోగించడం తగదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలి.
– డి.శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
బోధపడని ప్లాన్!


