రెచ్చిపోతున్న మట్టి మాఫియా
మార్కాపురంలో ట్రాక్టర్ మట్టి రూ.1000 కూటమి నాయకుల కనుసన్నల్లో అక్రమ దందా కన్నెత్తి చూడని అధికారులు
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణ శివార్లలో మట్టిమాఫియా రెచ్చిపోతోంది. నాలుగు రోజులుగా దరిమడుగు సమీపంలోని మమ్మసాబ్ కుంట వద్ద మట్టిని జేసీబీ, పొక్‌లైనర్లతో తవ్వి ట్రాక్టర్లతో, టిప్పర్లతో తరలించుకుపోతున్నారు. దీంతో రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. మట్టి ట్రాక్టర్లలో నుంచి మట్టి కిందపడి వాహనాల రాకపోకల సమయంలో దుమ్మురేగి వాహనదారుల కళ్లలో పడుతోంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తమ కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ దందాకు ఎవరైనా అడ్డొస్తే అంతు తేలుస్తామంటూ బాహాటంగా బెదిరిస్తున్నారు. దీంతో ఎవరూ ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులు కూడా తెలీనట్టు నటిస్తున్నారు.
ట్రాక్టర్ మట్టి
రూ.500 నుంచి రూ.1000కి పెరుగుదల..
గతంలో ట్రాక్టర్ మట్టి రూ.500 ఉండగా ఏకంగా రెట్టింపుచేసి అమ్ముతున్నారు. ఎక్కడైనా చెరువులో మట్టి తవ్వుకున్నా స్థానికంగా ఉండే కూటమి నాయకులకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందే. దీంతో భవన నిర్మాణదారులు మట్టిని కొనాలంటే భయపడుతున్నారు. కుంట, దరిమడుగు మధ్యలో ఉన్న మమ్మసాబ్ కుంట, గోగులదిన్నె తదితర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మండలంలోని పలు చెరువుల్లో నీళ్లు ఉండటంతో ప్రభుత్వ భూముల్లో ఉన్న మట్టిని జేసీబీల సాయంతో తవ్వి అమ్ముతున్నారు. గురువారం క్రిస్మస్ పండుగ కావడంతో మట్టి తవ్వకాలకు సెలవు ప్రకటించారు. కూలీలు ఎవరూ రాకపోవడంతో పనులు ఆపారు. త్వరలో జిల్లా కానుండటంతో మార్కాపురం పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములను రియల్‌ఎస్టేట్ వెంచర్లుగా మార్చి ఫ్లాట్లుగా పెట్టి అమ్ముతున్నారు. వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మార్చాలంటే కచ్చితంగా మట్టి అవసరమవుతోంది. ఒక ఎకరా భూమిని చదువు చేయాలంటే సుమారు 40 నుంచి 50 ట్రాక్టర్ల మట్టి కావాలి. వ్యవసాయ భూమి కాస్త లోతుగా ఉంటే మరో 30 ట్రాక్టర్ల మట్టి అదనంగా తోలాల్సి ఉంటుంది. ఈ అవసరమే మట్టి మాఫియాకు వరంగా మారుతోంది. అక్రమార్కులు కూటమి నాయకులు కావడంతో రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు కూడా చూసిచూడనట్టు పోతున్నారు. మార్కాపురం నుంచి తర్లుపాడు రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, కుంట రోడ్డుల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్లకు వందల సంఖ్యలో ట్రాక్టర్ల మట్టి అవసరం. ఈ నేపథ్యంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, అసైన్‌మెంట్ ల్యాండ్‌లలో మట్టి వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్టుగా తవ్వకాలు చేపడుతున్నారు.
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
రెచ్చిపోతున్న మట్టి మాఫియా


