నారా లోకేష్ ప్రసంగాల్లో కొత్త కోణం.. పరువు పాయే..!

Yuva Galam Padayatra: New Angle In Nara Lokesh Speeches - Sakshi

తెలుగుదేశం నేత, మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు నారా లోకేష్ తన పాదయాత్రలో చేస్తున్న ప్రసంగాలలో కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. ఆయన ఒక స్పీచ్ ఇస్తూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు దేవుడని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాముడని, తాను మూర్ఖుడినని చెప్పారు. లోకేష్ చెబుతున్న అనేక విషయాలలో ఇది ఒకటి. పోలీసు అధికారులను, వైసీపీ నేతలను హెచ్చరించడానికి గాను ఆయన ఈ పోలిక తీసుకు వస్తున్నారు. ఎన్టీఆర్‌ దేవుడు అయితే ఆయనను ఎందుకు పదవి నుంచి దించేశారు? సొంత కుటుంబ సభ్యులే దారుణంగా ఎందుకు అవమానించారు? ఆ బాధతో కుమిలి, కుమిలి చివరికి గుండెపోటుతో మరణించారే!

చంద్రబాబు శ్రీరాముడు అయితే తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతులను ఎలా చేశారో చెప్పగలగాలి. శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరధుడి మాట నెరవేర్చడానికి అడవులకు వెళ్లారు. మహారాజ పదవిని తృణప్రాయంగా వదలుకున్నారు. అది ఆయన గొప్పదనం. కాని చంద్రబాబు  తన తండ్రితో సమానం అయిన  ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడానికి చేయని యత్నం లేదు. చివరికి ఆయన సీఎం పదవిని, ఆయన స్థాపించిన టీడీపీని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత  ఎన్టీఆర్‌ జీవించి ఉన్న కొద్ది నెలల్లో పలుమార్లు అవమానకరంగా మాట్లాడారు.

అంతేకాదు. శ్రీరాముడు సత్యవాక్పరిపాలకుడుగా పేరొందారు. కాని చంద్రబాబు అసత్యాల పునాదులపై పెద్ద పెద్ద మేడలే నిర్మించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయినా ఏ రకంగా శ్రీరాముడితో పోల్చారో తెలియదు. లోకేష్‌కు ఉపన్యాసం రాసిస్తున్నవారు ఇలాంటి విషయాలతో సంబంధం లేకుండా అర్ధం,పర్ధం లేకుండా డైలాగులు పెట్టి పరువు తీస్తున్నారు. దీనివల్ల  రాజకీయ భవిష్యత్తుకోసం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు నష్టం తప్ప లాభం ఉండదు. ఈ రెండు పోలికలు ఇలా ఉంటే ఏకంగా తనను తాను మూర్ఖుడినని ఆయన చెప్పుకుంటున్నారు.

మూర్కులతో పోల్చుకోవడం ఎంత తెలివైన పనో తెలియదు. వైసీపీ ప్రభుత్వంపై  వీరు  సైకో అంటూ విమర్శలు చేస్తుంటారు. వాటిని పూర్వపక్షం చేస్తూ తానే సైకోనని ఆయన చెప్పుకుంటున్నట్లుగా ఉంది. తన తల్లిని అసెంబ్లీలో ఎవరూ అవమానించకపోయినా, లోకేష్ కూడా అదే పాట పాడడం దురదృష్టకరం. తల్లిని ఈ దిక్కుమాలిన రాజకీయాలలోకి లాగడం బాధాకరం. శ్రీరాముడిలో మార్పు వచ్చిందట.. వారి సంగతి రాముడే తేల్చుతారట.. అంటూ తండ్రిని ఉద్దేశించి చెబుతున్నారు. చంద్రబాబేమో తన భార్యను అవమానించారని శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయి, కొద్ది గంటల తర్వాత బోరున విలపించిన సన్నివేశంతో కలకలం సృష్టించారు.

లోకేష్ ఏమో చంద్రబాబు ఏదో చేసేస్తారని అంటున్నారు. ఇది వారి వ్యక్తిగత విషయం. వారిష్టం. చంద్రబాబు అయినా, లోకేష్ అయినా పదే, పదే పోలీసులను నిందించడం ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం  ఏపీ పోలీసులు వివిధ రంగాలలో నెంబర్ ఒన్ గా నిలిచారని మెచ్చుకుంటుంటే, టీడీపీ నేతలు మాత్రం వారి పట్ల పూర్తి అనుచితంగా వ్యవహరిస్తున్నారు. వారు ఏమి తిట్టినా ఏమీ కాదులే అన్న ధీమా ఉండవచ్చు. వ్యవస్థలను మేనేజ్ చేయగల సత్తా తమకు ఉందన్న నమ్మకం కావచ్చు. తాజాగా అచ్చెన్నాయుడు వేల మంది పాల్గొన్న బహిరంగ సభలో అంత దారుణంగా బూతుపదాన్ని వాడడమే కాకుండా దానిని సమర్ధించుకుంటున్న తీరు అభ్యంతరకరంగా ఉంది.

రాయడానికి కూడా వీలులేని ఆ మాట బూతు కాదని, రొటీన్ భాష అని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. గ్రామాలలో అలాగే మాట్లాడుకుంటారట. తమ ఇంటిలోనో, తమ మనుషుల వద్దో ఆయన ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టుకోమనండి.కాని బహిరంగ సభలలో కూడా దూషణలకు దిగడం, అది కూడా పోలీసులను ఉద్దేశించి అనడం శోచనీయం. పోలీసులు బాధపడితే ఆ పదాన్ని బయటకు తీసుకుంటారట కాని, ఆయన బాధపడడం లేదట. కనీసం క్షమాపణ చెప్పాలన్న స్పృహ కూడా వ్యవహరిస్తున్నారు.

ఇదంతా చంద్రబాబు,లోకేష్‌లు అనుసరిస్తున్న విధానం వల్లే జరుగుతోందని అనుకోవాలి. తమను తిడుతున్నారని ప్రచారం చేసే టీడీపీ నేతలు పచ్చిబూతులు మాట్లాడడం ద్వారా తమ నైజాన్ని బయటపెట్టుకుంటున్నారు. మరో సంగతి ఏమిటంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని లోకేష్ చెబుతున్నారు. స్థానిక ఎన్నికలలో ఈ రిజర్వేషన్‌లు కల్పించలేకపోవడం వల్ల, పది శాతం తగ్గడం వల్ల పదహారు వేల పదవులు రాకుండా పోయాయట. ఈ లెక్కలు ఎక్కడ నుంచి తెచ్చారో తెలియదు. పైగా బీసీల రిజర్వేషన్లు తగ్గడానికి టీడీపీ వారు సుప్రింకోర్టుకు వెళ్లడమే కారణమన్నది అందరికి తెలిసిన విషయం.

బి.ప్రతాపరెడ్డి అనే టీడీపీ నేత ఈ రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. జగన్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లు ఇస్తూ జారీ చేసిన జిఓ కి వ్యతిరేకంగా ఆయన ఈ పని చేశారు. ఇప్పుడేమో లోకేష్ మళ్లీ 34 శాతం ఇస్తామని చెబుతున్నారు. దీనిని ఎలా నమ్మాలి?. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా రిజర్వేషన్‌లు పెంచుతుందన్న సంగతి ఆయన చెప్పగలగాలి. గతంలో కాపులను బీసీలలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని చెప్పి టీడీపీ మోసం చేసిందన్న విమర్శ ఉండనే ఉంది.

ఇప్పుడు కూడా అలాగే బీసీలను మోసం చేయడానికి లోకేష్ ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. లోకేష్ ఏ హామీ ఇచ్చినా తప్పు లేదు. కాని అది ఎలా అమలు చేస్తామో, ఎలా ఆచరణ సాధ్యమో చెప్పగలిగితే ప్రజలు నమ్ముతారు. అంతే తప్ప ఏదో ఒకటి చెప్పేస్తే జనం నమ్మేస్తారనుకుంటే అది కుదరదు. ఆ రోజులు పోయాయి.అదేకాదు. చంద్రబాబు రైతులకు ఎనభై శాతం రుణమాఫీ చేశారని కూడా లోకేష్ అంటున్నారు. నిజంగా అంత శాతం రుణ మాఫీ చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఇరవైశాతం సీట్లకే ఎందుకు పరిమితం అయిపోయింది.

కేవలం 23 సీట్లే సాధించి దారుణంగా పరాజయం చెందింది.చివరికి లోకేష్‌ కూడా మంగళగిరిలోనే ఓటమిపాలయ్యారు కదా! ఇవన్ని ఒక ఎత్తు అయితే లోకేష్ సమక్షంలో టీడీపీ కార్యకర్త ఒకరు కుప్పంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పడం హైలైట్‌గా ఉంది. సోషల్ మీడియాలో ఆ క్లిప్ హల్ చల్‌ చేస్తోంది. కుప్పంలో టీడీపీ పరిస్థితిపై నేతలు కొందరు ప్రాడ్‌గా నివేదికలు ఇస్తున్నారని ఆయన చెప్పారు. గ్రౌండ్ లెవెల్‌లో అలా లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన చెప్పిన తీరు చూస్తే నిజాయితీగానే పార్టీ గురించి ఆవేదన చెందినట్లు కనిపిస్తుంది.
చదవండి: లోకేష్‌ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్‌

ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా కావాలని మాట్లాడి ఉంటే, ఆయనను ఈ పాటికి పార్టీ నుంచి బహిష్కరించి ఉండేవారు. ఆయన బహిరంగంగా ఒక వాస్తవం చెప్పడం పార్టీకి నష్టం అవుతుంది. అయినా ఆ కార్యకర్త చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ తిరిగి పుంజుకునేలా చేయడానికి ఏమి చేయాలన్నదానిపై ఆలోచన చేసుకోవాలి. గత స్థానిక ఎన్నికలలో టీడీపీ కుప్పంలో ఘోరంగా ఓటమి పాలైంది. మండల, జడ్పిటిసి ఎన్నికలలో ఓటమి చెందడమే కాకుండా, కుప్పం మున్సిపల్ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడినా టిడిపి ఓడిపోయింది

కుప్పంలో ముఖ్యమంత్రి జగన్ స్కీములు బాగా పనిచేస్తున్నాయని, పలు అభివృద్ది కార్యక్రమాలకు జగన్‌ నిధులు ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఆ ప్రభావం వల్ల కుప్పం టీడీపీలో అలజడి ఏర్పడింది. దానికి తోడు ఇంతకాలం టీడీపీకి ఉపయోగపడ్డ బోగస్ ఓట్లను చాలావరకు తొలగించారన్న ఆందోళన కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా కుప్పం నుంచి పాదయాత్ర ఆరంభించిన లోకేష్ కు ఇది నిరాశ కలిగించే  పరిణామమే. 
హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top