
పల్నాడు: సత్తెనపల్లి పోలీసులు అమాయకులని, అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి పెడుతున్నారని కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పేర్ని నానికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు(జూలై 7) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి పోలీసులు అమాయకులు. అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్నందుకు నాపై కేసు పెట్టారు. పోలీసులు నిన్న మా ఇంటికి నోటీసు అంటించి వెళ్ళిపోయారు. 11 సెక్షన్లతో నామీద నేరం నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు 100 మందిలో నేను ఒక వ్యక్తిని. నా మీద కూడా కేసు నమోదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు, సస్పెండ్ గాని చేస్తామని అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో సైకో పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది. మహా అయితే బందర్ నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి జగన్ జెండా వదిలేదే లేదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు.
