సాక్షి, ఢిల్లీ: ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందోని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీ నియామకాల్లో అర్హులకు ఉద్యోగాలు అందలేదు. అర్హులైన నిరుద్యోగులకు అవకాశాలు దక్కలేదు. డీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయి. డీఎస్సీ పేపర్‌ను రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు అమ్ముకున్నారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగులు ఇచ్చారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో టీడీపీ సానుభూతిపరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వేలాది మంది మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. టీడీపీ స్వప్రయోజనాలు కాపాడే రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయిస్తున్నారు. భూముల కేటాయింపులపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి. రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఒక్క చదరపు అడుగుకు 20,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 5000 రూపాయల లోపే చదరపు అడుగుకు నిర్మాణం ఖర్చు పెడుతున్నారు. ఇదే అమరావతిలో జరుగుతున్న లూటికి నిదర్శనం. ఎన్‌హెచ్‌ఏ జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్‌కు 20 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. అదే అమరావతిలో 58 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో కూడా నిర్మాణపు ఖర్చులు ఈ స్థాయిలో లేవు. ఈ అంశాలపైన సమగ్రమైన సీబీఐ దర్యాప్తు జరగాలి. ఏపీలో దారుణమైన పాలనను కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం’ అని తెలిపారు.
అనంతరం, గాదె సాయికృష్ణ కేసు విషయమై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో పైశాచిక పాలన జరుగుతోంది. సీఐని సస్పెండ్ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని ప్రశ్నించారు. ఆ తల్లికి ప్రభుత్వ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘తమిళనాడులో లాకప్ డెత్ జరిగితే పోలీసులకు జీవిత శిక్ష విధించారు. ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు?. తమిళనాడు కంటే ఘోరమైన ఘటన ఇది. ఎవరికి అన్యాయం జరిగిన వారి పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు.


