
వైఎస్సార్ జిల్లా: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలు ప్రజలు చూశారని జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. జడ్పీటీసీలాంటి చిన్న ఎన్నికలను సీఎం కార్యాలయం నుండి నడిపిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నేతలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేసి తిరిగి వారిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘ఓటర్లను తికమక చేసేందుకు జబ్లింగ్ చేశారు. ఒకగ్రామంలో ఓటు ఉంటే మరో గ్రామంలో ఓటు వేసేలా కుట్రలు చేశారు. కిలోమీటర్ల మేర ప్రజలు దూరం వెళ్ళి ఓటు వేసేలా ప్లాన్ వేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలో రిగ్గింగ్ చేయాలని చూస్తున్నారు. జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గం నుండి ప్రజలను రప్పించి రిగ్గింగ్ కు ప్లాన్ వేశారు.
ఎక్కడ ఉన్నారో డోర్ నంబర్‌తో సహా తమ దగ్గర ఉన్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసినా స్థానికులు కానీ వారు ఎందుకు ఉన్నారు...?, ఓటు స్లిప్పులు ఓటర్లకు ఇవ్వకుండా బయటి నుంచి రప్పించిన వారికి ఇస్తున్నారు. ఏజెంట్ గా కూర్చోవాలన్నా కేసులు పెడతాం అని భయపెడుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేస్తారు. ఎన్నికలు అనుకున్నారో.. పత్తి వ్యాపారం అనుకున్నారా!, 10 వేల ఓట్లకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది’ అని విమర్శించారు.