
అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని చూపిస్తున్న అనిల్‌యాదవ్
మైనింగ్ యజమానులకు ఎంపీ బెదిరింపులు
నెల్లూరు (పొగతోట): నెల్లూరు జిల్లాలో వేలాది కుటుంబాలను రోడ్లపాల్జేసి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మైనింగ్ మాఫియాగా మారారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి 5 రోజులు గడువు ఇస్తున్నానని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే సైదాపురం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.
ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్‌తో తమకేమీ సంబంధం లేదని ఆయన్ను కలిసిన లీజుదారులకు ఎంపీ చెప్పారన్నారు. అయితే, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డైరెక్టర్‌గా లక్ష్మి క్వార్ట్ ్జ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్థాపించారని ఆధారాలు చూపించారు. వాస్తవాలు కనబడుతుంటే మైనింగ్‌తో ఆయనకు సంబంధలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మైనింగ్‌తో ఏ సంబంధం లేకపోయినా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారని.. అక్రమ మైనింగ్‌కి పాల్పడుతూ రూ.వందల కోట్లు దోచుకుంటున్న ఎంపీపై మాత్రం కేసులు ఎందుకు పెట్టరని నిలదీశారు.
గత ప్రభుత్వంలో మైన్లకు రూ.255 కోట్ల జరిమానా
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్‌పై అధికారులు చిత్తశుద్ధితో పనిచేశారని అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. అప్పట్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారికి రూ.255 కోట్ల జరిమానాలు విధించారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిమానాలు విధించిన, కేసులు ఉన్న గనులను మాత్రమే ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మైనింగ్ ద్వారా రూ.300 కోట్లు ఆదాయం వస్తే.. ప్రస్తుతం రూ.30 కోట్లు కూడా ప్రభుత్వానికి రావడం లేదన్నారు.
సైదాపురం మండలంలో 200 మైన్లు ఉన్నా.. కేవలం 30 మాత్రమే ప్రారంభించడం వెనుక రహస్యమేమిటని ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి స్వార్థంతో వ్యవహరిస్తూ ఆయన చెప్పిన ధరకు, ఆయన కంపెనీకే సరఫరా చేసే వారికి మాత్రమే మైనింగ్ అనుమతులు ఇచ్చారన్నారు. మైనింగ్ యజమానులు కోర్టుకు వెళితే వాటిని తెరవాలని ఫిబ్రవరిలో కోర్టు ఆదేశించిందన్నారు. అయినా ఇప్పటివరకు గనులను తెరవడంలేదన్నారు. దీంతో మైనింగ్ యజమానులు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మళ్లీ కోర్టును ఆశ్రయించారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మైనింగ్ యజమానులెవరూ ఎవరూ కోర్టుకు వెళ్లలేదన్నారు. మైనింగ్ పరిశ్రమను తెరవనివ్వకుండా, ఇతరులకు పర్మిట్లు రాకుండా ఎంపీ అడ్డుకుంటున్నారని తెలిపారు.
అన్ని ఎక్స్‌పోర్టు కంపెనీలు మూత
గతంలో ఇక్కడ దాదాపు 30 ఎక్స్‌పోర్టు కంపెనీలు ఉంటే.. ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయని, ఎంపీ వేమిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న రెండు కంపెనీలు మాత్రమే ఎక్స్‌పోర్టు చేస్తున్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక లక్ష్మి క్వార్ట్ ్జ కంపెనీ ఏర్పాటు చేయగా, తాజాగా ఫినీ క్వార్ట్ ్జ ప్రారంభించారన్నారు. ఎగుమతిదారుందరినీ నిలిపివేశారని.. ఒక్క ఎంపీ వేమిరెడ్డి ఎక్స్‌పోర్ట్ కంపెనీ ద్వారానే సరుకు రవాణా జరుగుతోందని ఆధారాలతో సహా వెల్లడించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల మైన్‌లు కూడా తెరవలేదన్నారు. ధనదాహంతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ఎంపీకి పేదల ఉసురు కచ్చితంగా తగులుతుందన్నారు.

50 ఏళ్లు దాటిన మైన్లు స్వాధీనం చేసుకోవాలి
గతంలో శోభారాణి మైన్ కంపెనీకి రూ.32 కోట్లు ఫైన్ వేశారని అనిల్‌కుమార్ గుర్తు చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో శోభారాణి మైనింగ్ కంపెనీ ఇల్లీగల్ అని చెప్పారన్నారు. గతంలో మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ పంచనామా చేసి 38 వేల మెట్రిక్ టన్నుల క్వార్ట్ ్జ ఉందని నివేదిక ఇచ్చారన్నారు. ప్రస్తుతం అదే అధికారి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల క్వార్ట్ ్జ ఉందని నివేదికలు ఇచ్చారన్నారు. 50 ఏళ్లు దాటిన గనులను నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. లీజు సమయం దాటినా మైన్లలో అందుబాటులో ఉన్న మెటీరియల్‌ను వేలం వేయాలని ప్రస్తుత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు నిల్వ ఉన్న క్వార్ట్ ్జను వేలం వేస్తే ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న గంజాయి బ్యాచ్
సైదాపురంలో గంజాయి బ్యాచ్ మాఫియా నడిపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. మైన్ల వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా మహిళలను, అటుగా వెళ్తున్న వాహనాలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అమర్‌నాథ్‌రెడ్డి అనే వ్యక్తి అక్రమ మైనింగ్ చేస్తున్నారని కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. ప్రస్తుతం అతనే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాడని తెలిపారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మఫ్టీలో వెళితే సైదాపురంలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు.