● అన్నదాతలను గాలికొదిలేశారు
● అన్నదాత సుఖీభవ’ పథకంలో భారీ కోత
● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజం
కోవూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, చంద్రబాబుకు వ్యవసాయమంటే ఆది నుంచి గిట్టదని, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అన్నదాతలను పూర్తిగా గాలికొదిలేస్తారని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మండి పడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సాగుకు ముందే పెట్టుబడి సాయం అందేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఏకంగా ఏడు లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద కోత విధించారని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. గతంలో 53.58 లక్షల మందికి సాయం అందగా, ఇప్పుడు కేవలం 46.85 లక్షల మందికే పరిమితం చేయడం దారుణమన్నారు. జిల్లాలో సుమారుగా జగనన్న ప్రభుత్వంలో 2.15 లక్షల మంది రైతులకు న్యాయం జరిగిందని, అయితే కూటమి కుట్రలతో 1.95 లక్షలకు కుదించి వేలాది మంది రైతులను ఏరివేసిందన్నారు. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు కాకుండా, రాష్ట్రం రూ. 20 వేల లెక్క ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 వేల మందికి పైగా రైతు కూలీలు చనిపోయారని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కౌలు రైతులకు మొండిచేయి
మీరు చేసిన మోసాలకు కౌలు రైతులు అప్పులో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కౌలు రైతులకు పైసా కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ప్రసన్న దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కౌలు రైతులకు సైతం భరోసా కల్పించారని, కానీ ఇప్పుడు వారిని పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ఏపీ రైతుల రుణభారంలో దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ధరల స్థిరీకరణ నిధి లేదు, ఇన్‌పుట్ సబ్సిడీ లేదు, కనీసం పంటల బీమా ప్రీమియం కూడా కట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఫలితంగా రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నారు.
జగన్ హయాం సువర్ణాధ్యాయం
వైఎస్ జగన్ పాలనలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని ప్రసన్న గుర్తుచేశారు. రైతులకు సున్నా వడ్డీ కింద సకాలంలో రుణాలు చెల్లించిన 84.66 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చారన్నారు. ఉచిత పంటల బీమా ద్వారా 54.55 లక్షల మంది రైతులకు రూ. 7,802 కోట్ల బీమా సాయం అందించారన్నారు. విపత్తులు సంభవిస్తే అదే సీజన్‌లో త్వరితగతిన పరిహారం అందించడమే కాకుండా, దురదుష్టవశాత్తు రైతు ఆత్మహత్య చేసుకుంటే 48 గంటల్లోనే రూ. 7 లక్షల పరిహారం అందించిన ఘనత జగన్‌దే అని కొనియాడారు.


