రేపటి నుంచి ఒంటిపూట బడి | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఒంటిపూట బడి

Mar 15 2026 1:02 AM | Updated on Mar 15 2026 1:02 AM

నెల్లూరు (టౌన్‌): ఎండలు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు సోమవారం నుంచి ఒంటిపూట నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట రాగిజావ, మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులకు అందజేయాలన్నారు.

విద్యుత్‌ తీగలు పడి

రైతు మృతి

మనుబోలు: పొలంలో గడ్డి కోసుకుని వస్తుండగా విద్యుత్‌ తీగలు పైన పడడంతో ఓ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బండేపల్లిలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల చినపోతయ్య (54) గేదెలు, గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తాడు. పశువుల మేత కోసం పొలంలో గడ్డి కోసుకుని తిరిగి వస్తుండగా పొలాల్లోని ఓ విద్యుత్‌ స్తంభం గాలికి ఒరిగిపోవడంతో కరెంట్‌ తీగలు పైన పడ్డాయి. దీంతో పోతయ్య అక్కడికక్కడే షాక్‌నకు గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. గడ్డి కోసమని ఇంటి నుంచి వెళ్లిన పోతయ్య గంటల వ్యవధిలోనే విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అతిగా మద్యం తాగిన

వ్యక్తి మృతి

మనుబోలు: అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మనుబోలులోని చెర్లోపల్లి రోడ్డు పక్కన శనివారం వెలుగుచూసింది. మనుబోలుకు చెందిన దాసరి రఘురామయ్య (55) కుటుంబంతో గొడవల కారణంగా ఐదారేళ్లుగా ఒంటరిగా మరో ఊరిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవా రం అతిగా మద్యం తాగి మనుబోలులోని ఇంటికి వచ్చి భార్య, కోడలుతో గొడవ పడినట్లు సమాచారం. తర్వాత ఏమి జరిగిందో కానీ శనివారం ఉదయం హైవే పక్కన ఉన్న ఆంధ్రా విలాస్‌ హోటల్‌ సమీపంలో మృతి చెందిన ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అతిగా మద్యం తాగడంతో గొంతు తడారిపోయి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement