● వీడ్కోలు పలికిన ముత్యాలమ్మ
● ముగిసిన జాతర ● పోటెత్తిన భక్తులు
చిల్లకూరు: మండలంలోని తూర్పుకనుపూరులో జరుగుతున్న పోలేరమ్మ జాతర శుక్రవారం ముగిసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. ముత్యాలమ్మ చెల్లిగా భావించే పోలేరమ్మ జాతరను నాలుగురోజులపాటు వైభవంగా నిర్వహించారు. చివరిరోజున వెళ్లనంపు కార్యక్రమంలో భాగంగా పోలేరమ్మను నిలిపిన చోట ముందుగా కుంభం పోసి మొక్కులు చెల్లించారు. పొలి, బలి కార్యక్రమం ముగిసిన అనంతరం అమ్మవారిని వెళ్లనంపేందుకు గ్రామస్తుల నుంచి గణాచారి అనుమతి పొందారు. తర్వాత పోలేరమ్మను సప్పరం పీటపై ఉంచి తలపై మోసుకుంటూ పురవీధుల్లో నడుస్తుండగా మొక్కులున్న వారు కొత్త చీరలు ఆ మార్గంలో కింద పరిచారు. వాటిపై అమ్మవారిని సాగనంపారు. మార్గమధ్యలో పోలేరమ్మ తన అక్క ముత్యాలమ్మను పలకరించి వెళ్లేందుకు గుడి వద్దకు రాగా గణాచారి సాగనంపుతున్నట్లుగా చెప్పిన ఽకథ ఆకట్టుకుంది. అనంతరం ముత్యాలమ్మ ఆలయం వెనుక వైపున ఉన్న ద్వారం నుంచి పోలేరమ్మను పంబలోళ్ల వాయిద్యాల నడుమ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆసాదులు పోలేరమ్మకు సంప్రదాయంగా కథ వినిపించి మెప్పించే సన్నివేశాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం గ్రామానికి పడమటి వైపున ఉన్న జీడిమామిడి పొదల్లోకి తీసుకెళ్లి పోలేరమ్మను నిమజ్జనం చేసారు. కార్యక్రమాన్ని అదికారులు, పర్యవేక్షించారు.


