పిల్లలు లేరు..వంట చేయలేదు | - | Sakshi
Sakshi News home page

పిల్లలు లేరు..వంట చేయలేదు

Mar 14 2026 7:28 AM | Updated on Mar 14 2026 7:28 AM

వెంకటాచలం: మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు ఈ లక్ష్మిరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. తొలుత వెంకటాచలం మండలం లింగంగుంటలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రానికి పేరు బోర్డు లేకపోవడం, కేంద్రంలో పిల్లలు, సిబ్బంది ఎవరూ లేకపోవడం, ఉదయం 11 గంటలు దాటినా వంట చేయకపోవడాన్ని గుర్తించారు. రికార్డులను తనిఖీ చేయగా 12వ తేదీ హాజరు నమోదు చేయకపోవడం, కేంద్రంలో 16 మంది పిల్లలు నమోదై ఉండగా, కేవలం ముగ్గురు మాత్రమే హాజరైనట్లుగా నమోదు చేయడాన్ని పరిశీలించారు. స్టాక్‌ రిజిస్ట్టర్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం, స్టాక్‌ రిజిష్టర్‌, భౌతిక స్టాక్‌ మధ్య 183 గుడ్లు తేడా, ఫేజ్‌ –ఐకు చెందిన 46 బ్లూ కలర్‌ గుడ్లు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. అనంతరం టీహెచ్‌ఆర్‌ లబ్ధిదారులకు ఫోన్‌ చేసి ఆరాతీయగా ఇప్పటి వరకు గుడ్లు ఇవ్వలేదని తెలిపారు. దీంతో అంగన్‌వాడీ టీచర్‌, సూపర్‌వైజర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఐసీడీఎస్‌ నోడల్‌ ఆఫీసర్‌, పీడీ అనురాధకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సర్వేపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో ఫేజ్‌–ఐకు చెందిన 131 బ్లూ కలర్‌ గుడ్లు నిల్వ ఉండడం, గతేడాది అక్టోబరు నుంచి సూపర్‌వైజర్‌ కేంద్రాన్ని సందర్శించకపోవడాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్‌, సూపర్‌వైజర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం సర్వేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో 540 కలర్‌ మార్కింగ్‌ లేని గుడ్లు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. ఇలాంటి స్టాక్‌ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. అనంతరం గుడ్ల సరఫరాదారుడితో మాట్లాడగా తన వద్ద కలర్‌ మార్కింగ్‌ చేసిన గుడ్లు లేవని సమాధానం ఇచ్చాడు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని, పాఠశాల హెచ్‌ఎం, ఎగ్‌ వెండర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట జిల్లా సరఫరాల అధికారిణి లీలారాణి, జిల్లా మేనేజర్‌ అర్జున్‌రావు, ఆర్‌ఐ సుస్మిత తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో

ఆహార కమిషన్‌ తనిఖీలు

వెలుగులోకి పలు అక్రమాలు

అంగన్‌వాడీలు, సూపర్‌వైజర్లు, హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement