● చోరీ కేసులో
సహాయకుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): యజమాని వద్ద నమ్మకంగా ఉంటూ నగదు, బంగారు గొలుసును అపహరించిన సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. కొండాయపాళెం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎ.శ్రీధర్‌రెడ్డి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. అతని వద్ద సత్యసాయి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన కె.శ్రీనివాసులురెడ్డి సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శ్రీధర్‌రెడ్డి తల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన శ్రీధర్‌రెడ్డి వ్యాపారానికి సంబంధించిన రూ.16.50 లక్షల నగదును ఇంటికి తీసుకొచ్చి శ్రీనివాసులురెడ్డికిచ్చి బీరువాలో భద్రపరచమని చెప్పాడు. 6వ తేదీన అతను నిద్ర లేచి చూడగా సహాయకుడితోపాటు నగదు, 55 గ్రాముల బంగారు గొలుసు కనిపించలేదు. శ్రీధర్‌రెడ్డి గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ సాంకేతికత ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. శుక్రవారం భగత్‌సింగ్ కాలనీ సమీపంలో శ్రీనివాసులురెడ్డిని అరెస్ట్ చేసి. రూ.15.70 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని నగర ఏఎస్పీ దీక్ష అభినందించారు.


