నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో గ్యాస్ కొరత ఉందని వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని జాయింట్‌కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి లీలారాణితో కలిసి గ్యాస్ సరఫరా సంస్థల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన మేర గ్యాస్ నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద వీఆర్వోతో పాటు కానిస్టేబుల్‌ను నియమించి గ్యాస్ సిలిండర్ల డెలివరీని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. డీలర్లు కూడా ప్రతిరోజూ స్టాక్ వివరాలు, బుకింగ్, డెలివరీ స్టేటస్‌లను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు, ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు నిరంతర పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఆయిల్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్‌సిలిండర్లను సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత ఏజెన్సీలు లేదా అధికారులకు తెలియజేయాలని సూచించారు. హెచ్‌పీ, భారత్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ల గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.


