గ్యాస్‌ గుది ‘బండ’ | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ గుది ‘బండ’

Mar 14 2026 7:27 AM | Updated on Mar 14 2026 7:27 AM

కొనుగోలు ‘భారం’.. దొరకడం కష్టం

గృహ వినియోగ సిలిండర్లపై రూ.60

వాణిజ్య సిలిండర్లపై రూ.115 పెంపు

జిల్లాలో ఏటా రూ .47 కోట్ల భారం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్‌ ధరలపై పడింది. జిల్లాలో గ్యాస్‌ వినియోగం అధికంగా ఉండడంతో ఈ పెంపు ప్రభావం మరింత ఎక్కువగా కనిపించనుంది. అంచనాల ప్రకారం జిల్లాలో వినియోగదారులపై ఏటా సుమారు రూ.47 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు గ్యాస్‌ ధరల పెంపు మరో భారంగా మారింది.

ఉదయగిరి: ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర మరో సారి పెంచింది. గృహ వినియోగదార్లు ఉపయోగించే (14.2 కేజీలు) సిలిండర్‌ ధరను ఒక్కసారిగా రూ.60 పెంచి సామాన్య ప్రజల్లో గుండెల్లో మంటలు రేపింది. వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్ల ధరను కూడా రూ.115 పెంచింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గత ఏప్రిల్‌ రూ.50 పెంచితే.. తాజాగా ఇప్పుడు మరో రూ.60 పెంచింది. ఒక వైపు నిత్యావసర సరుకుల ధరలు చాపకింద నీరులా పెరుగుతూ పోతున్నాయి. దానికి తోడు గ్యాస్‌ ధర కూడా పెరగడంతో సామాన్య జనం నెత్తిన భారం గుది బండగా మారుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా గ్యాస్‌, చమురు ధరలు పెరిగినా, రాష్ట్ర ప్రజల ఆర్థిక, జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని పెరిగిన ధర ప్రభుత్వం భరించకపోగా పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నెత్తిన మోపింది. దీంతో సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

రూ.47 కోట్ల భారం

జిల్లా వ్యాప్తంగా 7,87,483 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగదార్లకు సంబంధించి సాధారణ కనెక్షన్లు 4,64,871, దీపం కనెక్షన్లు 2,67,421, ఉజ్వల పథకం కనెక్షన్లు 18,986, సీఎస్‌ఆర్‌ కనెక్షన్లు 33,589 ఉన్నాయి. ఇవి కాకుండా వాణిజ్య కనెక్షన్లు మరో 2,616 వరకు ఉన్నాయి. ఇంతకు ముందు గృహ వినియోగ సిలిండరు ధర రూ.890 ఉండగా, పెరిగిన ధర ప్రకారం రూ.950 వరకు చేరుకుంది.అదే వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,066కు చేరింది. ప్రస్తుతం పెరిగిన ధర ప్రకారం జిల్లా వ్యాప్తంగా వినియోగదార్లపై ఏడాదికి సుమారు రూ.47 కోట్ల భారం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ రంగాలు కుప్పకూలాయి. దీంతో జిల్లాలో పేదవర్గాల వారికి పనులు దొరక్క చేతిలో చిల్లగవ్వలేక, కొనుగోలు శక్తి క్షీణించింది. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసింది. చౌక దుకాణాల్లో సబ్సిడీపై ఇచ్చే కందిపప్పు కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వంట గ్యాస్‌ ధర పెరగడం సామాన్యలకు గుదిబండగా మారింది.

వణికిస్తున్న గ్యాస్‌ కొరత..

గ్యాస్‌ ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరో పక్క గ్యాస్‌ కొరత ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే గ్యాస్‌ కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో హోటళ్లు, దేవాలయాల్లో ప్రసాదాల తయారీ నిలిచిపోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంతో పాటు గ్యాస్‌ ఏజెన్సీల్లో స్టాక్‌ లేదని సమాచారం ప్రజల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. మరో వైపు కొన్ని హాటళ్లల్లో తిన్న ఫుడ్‌కు గ్యాస్‌ వినియోగ బిల్లులు యాడ్‌ చేస్తుండడం, కట్టెల పొయ్యిలపై వంటలు చేయడం వంటి రీల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంకో వైపు గ్యాస్‌ బుకింగ్‌ ఆన్‌లైన్‌ కావడంతో.. ఆన్‌లైన్‌ బుకింగ్‌లు కూడా కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పరేషాన్‌ చెందుతున్నారు. ఆఫ్‌లైన్‌లో గ్యాస్‌ కొనుగోలు చేసే ఏజెన్సీల వద్ద జనం సిలిండర్లు పట్టుకుని పోటెత్తుతున్నారు.

సామాన్యులపై పెనుభారం

పెంచిన గ్యాస్‌ ధరలతో సామాన్యులపై భారం పడుతోంది. ఇప్పటికే సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నారు. రోజువారీగా కుటుంబం గడవడమే కష్టంగా మారింది. పేదల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. సంక్షేమ పథకాలు పూర్తిగా గాలికి వదిలేయడంతో పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పడు మళ్లీ గ్యాస్‌ ధరలు పెంచడం గోరు చుట్టుపై రోకలి పోటు చందంగా మారింది. పెరిగిన గ్యాస్‌ ధరను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించి పేదలను ఆదుకోవాలి.

– మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఉదయగిరి

పెరిగిన సిలిండర్‌ ధర తగ్గించాలి

ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించాలి. ఏడాదిలో రెండు సార్లు ధరలు పెంచారు. మాలాంటి రోజు వారి కూలీ పనులు చేసుకునే జనాలకు భారంగా మారింది. అసలే నిత్యావసర సరుకులఽ ధరలు పెరిగి ఏ వస్తువు కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్యాస్‌ ధర పెరగడంతో కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరను తగ్గించి పేదలను ఆదుకోవాలి.

– ఎన్‌.లక్ష్మీదేవి, గృహిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement