
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలను పీడించడానికే అంటూ ఆరోపించారు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు కురసాల కన్నబాబు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు అని అన్నారు. కొడుకు తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబే ఆయనే వేధింపులను నేర్పిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ రూరల్‌లో వైఎస్సార్‌సీపీ డిజిటల్ బుక్‌ను ఉత్తరాంధ్ర జిల్లాల రిజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమికి అధికారం వచ్చింది ప్రజల్ని పీడించడానికి.. వైఎస్సార్‌సీపీని అణగదొక్కడానికే. సామాన్యుల నుండి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు. పోలీసులు ఎందుకు దిగజారిపోయి పని చేస్తున్నారని సాక్షాత్తూ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు అని చెప్పాలి. అలా కాకుండా.. ప్రజల్ని పీడించుకుని, వేధించుకుని తిను అని చంద్రబాబు తన కొడుక్కి నేర్పించాడు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టారు. ప్రజలకు సంక్షేమం ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఫలానా పథకం రాలేదని అడగాలంటే భయపడే పరిస్ధితి వచ్చింది. ఈ అన్యాయాలు అన్నింటినీ తప్పకుండా డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.