సాక్షి, నెల్లూరు: చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొన్నదని కాకాణి చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం పట్టుకుంది అంటూ విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి కాకాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాక్కట్టు పెట్టి ద్రోహిగా మారాడు. కలత చెందిన రైతులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా..? కాదా?. రేవంత్ రెడ్డి అడగటంతో చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడటం నిజం కాదా?. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తారు ఏమో అనుకుంటే సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. 20 టీఎంసీల నీళ్ళు పోతే ఏంటి అని రివర్స్ లో మాట్లాడటం విడ్డూరంగా వుంది.
రాయలసీమ లిఫ్ట్ రైతులకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది అని ఆలోచించి వైఎస్ జగన్ ఆ ప్రాజెక్టు చేపట్టారు. నేడు సంజీవనీ లాంటి రాయలసీమ లిఫ్ట్ ను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెట్టాడు. పోతిరెడ్డిపాడు నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించున్న పరిస్థితి లేదు. రైతులు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఉమ్మేస్తున్నా పట్టించుకోవడం లేదు. కల్వకుర్తి సామర్థ్యం పెంచుకుంటే నోరు మెదపలేదు. తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీలు అధికంగా వినియోగించుకుంటున్నా నోరు మెదపటం లేదు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం.
చంద్రబాబు సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతులకు ద్రోహం తలపెట్టడం ప్రారంభించారు. అడ్డదారుల్లో నీటి ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తరలించుకుంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలతో రాయలసీమతో పాటు నెల్లూరు, కొంత ఒంగోలు రైతాంగం కూడా నష్టపోతున్నారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు మూడు సార్లు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు. రాయలసీమ, మిట్ట ప్రాంతాల రైతాంగం కోసం ఆలోచన చేసిన నాయకులు వైఎస్సార్, జగన్ మాత్రమే’ అని చెప్పుకొచ్చారు.


