
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు.. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేక వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు.
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తున్నారని అడిగతే మేము దేశద్రోహులమా?. మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఎందుకు?. అమరావతిని అభివృద్ధి చేయలేక మాపై విమర్శలు చేస్తున్నారు. మేం అప్పు చేస్తే తప్పు.. మీరు అప్పులు చేస్తే ఒప్పా?. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి. రూ.2,45,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయింది?. ఒక్క పెన్షన్లకు తప్ప ఏ సంక్షేమ పథకానికైనా కేటాయింపులు చేస్తున్నారా?.
రాష్ట్రంలో పొగాకు, మామిడి, మిర్చి రైతుల పరిస్థితి ఏంటి?. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేశారా?. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా?. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు?. ఉచిత గ్యాస్ సిలిండర్ అడిగితే దేశద్రోహులమా?. ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు పెడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం అంటున్నారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ ఇచ్చారా?. దీపం ఎంత మందికి వచ్చంది?. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని వ్యాఖ్యలు చేశారు.
