ఈ దారుణాల వెనుక 'పెద్ద కుట్ర' | YS Jaganmohan Reddy Fires On Chandrababu govt | Sakshi
Sakshi News home page

ఈ దారుణాల వెనుక 'పెద్ద కుట్ర'

Jul 3 2026 5:03 AM | Updated on Jul 3 2026 5:03 AM

YS Jaganmohan Reddy Fires On Chandrababu govt

క్రాంతికుమార్‌ తల్లి కన్నీటిని తుడుస్తూ ఓదారుస్తున్న వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ నడుస్తోంది: వైఎస్‌ జగన్‌

పోలీసులను ఉపయోగించుకుని సిండికేట్‌గా ఏర్పడి హత్యలు చేస్తున్నారు 

సీఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం కాపాడుతున్నారు 

క్రాంతి కుమార్‌పై ఎనిమిదేళ్లుగా ఎలాంటి కేసులు లేవు 

పోలీస్‌ స్టేషన్‌కు రోజూ రమ్మని మూడు నెలలు వేధించారు 

తన చేత చేయకూడని పనులు బలవంతంగా చేయించారని వీడియోలో క్రాంతికుమార్‌ చెప్పాడు 

దిగజారిన పోలీసు వ్యవస్థకు ఈ ఘటనే ఉదాహరణ 

సీసీటీవీ ఫుటేజ్‌ని ఎవరైనా డిలీట్‌ చేయొచ్చా, బ్యాకప్‌ ఉండదా? 

క్లియర్‌కట్‌గా రాజధానిలో ఒక రాకెట్‌ నడుపుతున్నారు 

క్రాంతి మరణానికి కారకులైన వారిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టాలి

ఇంత వరకూ కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు? 

క్రాంతి కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ అండగా ఉంటుంది 

మీడియాతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర రాజధానిలో ఒకే నెలలో రెండు మరణాలు జరిగాయి. ఒకటి లాకప్‌డెత్, మరొకటి బలవన్మరణం. ఈ మరణాల వెనుక పెద్ద కుట్ర ఉంది. పోలీసులను ఉపయోగించుకుని సిండికేట్‌గా మారి హత్యలు చేస్తున్నారు. సీఐ నుంచి సీఎం వరకూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు.’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ మాజీ సీఐ నాగరాజు, పోలీసుల వేధింపులు తాళలేక, సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం మాదిరిగా అన్ని వివరాలు చెప్పి, ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ గురువారం పరామర్శించారు. విజయవాడ, కృష్ణలంకలో ఉన్న బాధితుని ఇంటికి వెళ్లిన జగన్, క్రాంతికుమార్‌ భార్య, పిల్లలు, తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. పోలీసులు క్రాంతికుమార్‌ను ఏ విధంగా వేధించారనేది జగన్‌కు బాధిత కుటుంబం వివరించింది. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పిన జగన్, ఆ ఇంటి వద్దనే  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యం నడుస్తోందని ఈ సందర్భంగా జగన్‌ అన్నారు. క్రాంతికుమార్‌ కుటుంబం కడు పేదరికంలో ఉందని, ఒక అమాయకుణ్ని వేధించి, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దిగజారిన పోలీస్‌ వ్యవస్థకు ఈ సంఘటన నిదర్శనమని, ఇంత జరిగినా, ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇంకా జగన్‌ ఏమన్నారంటే..  

క్రాంతి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌ 

రాష్ట్రంలో దిగజారిన పోలీస్‌ వ్యవస్థ 
‘‘క్రాంతి కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి, ఆ కుటుంబాన్ని చూస్తే హృదయవిదారకమైన పరిస్థితి కనిపిస్తోంది. క్రాంతి కుమార్, అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి, తండ్రి, నాయనమ్మ..ఇలా అందరూ కలిసి ఈ చిన్న ఇంటిలో పేదరికంలో బతుకుతున్నారు. వారి కుటుంబాన్ని ఈ వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది. ఎనిమిదేళ్లుగా టాక్సీ నడుపుకుంటూ జీవిస్తున్నాడు క్రాంతి కుమార్‌. అతనిపై ఎలాంటి కేసులు లేవు. అంతకు ముందు చిన్నా చితకా కేసులు ఉన్నా అవన్నీ కొట్టివేశారు. శిక్ష కూడా పడలేదు. అయినా క్రాంతికుమార్‌ను రోజూ పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని 3 నెలలు వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ స్థాయికి పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయింది. నిండా నలభై ఏళ్లు కూడా లేని అలాంటి వ్యక్తిని ఏ నేరం చేయకపోయినా, పోలీసులు ఎందుకు  రోజూ స్టేషన్‌కు రమ్మని పిలిపించారు. తనను 3 నెలల నుంచి రోజూ స్టేషన్‌కు పిలిపించి వేధించారని, హింసించారని క్రాంతికుమార్‌ తన మరణ వాంగ్మూలం (సెల్ఫీ వీడియో రికార్డింగ్‌)లో చెప్పారు. పోలీసులు బలవంతపెట్టి తనతో చేయకూడని పనులు చేయించారని ఆ వీడియోలో తన గోడును చెప్పుకున్నాడు.  

వాళ్లను వాళ్లు కాపాడుకుంటున్నారు 
ఇదంతా రాజధాని ప్రాంతం విజయవాడలో జరిగింది. చంద్రబాబు పక్కనే ఉంటారు. కళ్లదుటే సీపీ, డీజీపీ, హోం మంత్రి, ముఖ్యమంత్రి ఆఫీసులున్నాయి. తన కొడుకు ఆత్మహత్య తర్వాత, ఆ వీడియోను ఆయన తండ్రి సీపీకి చూపినా, పట్టించుకోలేదు. ఏ చర్యా తీసుకోలేదు. మరి తప్పు చేసిన వారి­ని ఎందుకు రక్షిస్తున్నారు. క్లియర్‌కట్‌గా రాజధానిలో ఒక రాకెట్‌ నడిపిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే సీఐ నాగరాజుని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం చంద్రబాబు కాపాడుతున్నారు.  

ఎవరు పడితే వారు సీసీ ఫుటేజ్‌ తీసేయొచ్చా? 
కృష్ణలంక పొలీస్‌ స్టేషన్‌లో పరిధిలో ఒక నెల వ్యవధిలో రెండు మరణాలు జరిగాయి.  ఒకటి లాకప్‌డెత్‌. మరొకటి ఆత్మహత్య. అక్కడ సీసీ టీవీ ఫుటేజ్‌ కూడా లేదు. పోలీస్‌ స్టేషన్లలో తప్పనిసరిగా ఉండాల్సిన సీసీ కెమెరా ఫుటేజ్‌ మాయమైపోయింది. ఒక రిమాండ్‌ రిపోర్టులో మే 1 నుంచి జూన్‌ 1 వరకు ఒక నెల రోజుల ఫుటేజ్‌ లేదన్నారు. మరో దాంట్లో 18 నెలల నుంచి ఫుటేజ్‌ లేదన్నారు. ఎవరు పడితే వారు అలా సీసీ కెమెరాల ఫుటేజ్‌ తీసేయొచ్చా. మరి బ్యాకప్‌ ఉండదా?. అంటే ఒక పద్ధతి ప్రకారం పోలీస్‌ స్టేషన్లలో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారు. కొడుతున్నారు. చంపుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదు. చెత్తబుట్టలో వేస్తున్నారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు   

న్యాయం జరిగేలా అండగా నిలబడతాం 
ఇంత జరిగినా కేసు నమోదు చేయలేదు. నిజానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. ఈ కేసుకు సంబంధించి, న్యాయ సహాయం మొదలు, అన్ని రకాలుగా బాధితులకు మా పార్టీ తరపున అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేలా అవసరమైతే కోర్టులో కూడా పోరాడతాం’’ అని జగన్‌ స్పష్టం చేశారు.

‘సిండికేట్‌’ మర్డర్లు 
రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యం నడుస్తోంది. రాష్ట్ర రాజధాని ప్రాంతంగా భావించే విజయవాడ నడి»ొడ్డున ఒకే నెలలో రెండు మరణాలు జరిగాయి. అది కూడా పోలీసుల వేధింపుల వల్ల. పోలీస్‌ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ ఎందుకు మిస్సయిందని అడగండి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అరెస్టయిన సీఐ తన ప్రాణాలకు ముప్పు ఉందని అంటున్నారు. అంటే ఈ సంఘటనల వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అర్థం అవుతోంది. సీపీకి ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో పడేస్తున్నారు.  నేను బాధితుల పక్షాన నిలబడటం వల్ల కనీసం 46 రోజుల తరువాతయినా దారుణాలు బయటకు వచ్చాయి. లేదంటే మరుగున పడేసేవారు. పోలీసుల సాయంతో సిండికేట్‌గా మర్డర్లు చేస్తున్నారు. ఒకరినొకరు కాపాడుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement