
సాక్షి, గుంటూరు/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గత ఏడాది కాలంగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, చంద్రబాబు పాలన అంతా అవినీతి, స్కాములు, దోపిడీ మయంగా మారిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజా రాజకీయ పరిస్థితులపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద నాణేనికి రెండో వైపులా.. కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తోంది చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా!.

బాబు 12 నెలల పాలనలో..
ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, కాగ్ నివేదికను పరిశీలిస్తే.. అభివృద్ధి కనిపించలేదు. సంక్షేమం ఊసే లేదు. ఈ సంవత్సర కాలం అంతా మోసాలతో గడిపారు. ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. రాష్ట్ర ఆదాయమంతా బాబు గజదొంగల జేబుల్లోకి వెళ్తోంది. అదే మా హయాంలో.. కోవిడ్ విజృంభించిన సమయంలోనూ రాష్ట్రాన్ని గోప్పగా నడిపాం. అభివృద్ధి, సంక్షేమం.. ప్రజలకు మంచి పరిపాలన అందించాం.
అప్పుల సామ్రాట్ బాబు
ఈ 12 నెలల కాలంలోనే.. చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్ర రెవెన్యూ 3.8 శాతం మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్. మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే.. బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేశారు. మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు.
ఈనాడు.. ఓ మీడియానా?
ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ఓ మాఫియా రాజ్యం. సెకీకి సన్మానం అంటూ ఈనాడు నా ఫొటోలో ఓ కథనం ఇచ్చింది. 2021 డిసెంబర్‌లో ఏపీతో సెకీ ఒప్పందం అయితే, ఆపై రెండేళ్లకు సెకీ చైర్మన్ నియామకం జరిగింది. కానీ, సెకీకి సన్మానం అంటూ ఈనాడు తప్పుడు కథనాలు ఇచ్చింది. ఈనాడు.. టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కి తక్కువ. దున్నపోతును ఈనితే.. దూడను కట్టేసినట్లు ఉంది ఈనాడు తీరు. సిగ్గు పడాలి మీడియా అని చెప్పుకునేందుకు.
పరాకాష్టకు స్కాంలు
రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా.. ఇలా అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ నుంచి రాష్ట్రానికి రూపాయి రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటలకు యూనిట్‌కు రూ.4.60 చొప్పున ఒప్పందం చేసుకున్నారు. మా హయంలో రూ.2.49కే విద్యుత్ కొన్నాం. విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ఖర్చు తగ్గించాం. బాబు పాలనలో విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఖజానాకు గండి కొట్టారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదోగానీ.. ఉర్సా అనే సంస్థకు భూములు ఇచ్చారు. బిడ్ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇచ్చారు. స్కాంలకు పరాకాష్ట్ర అమరావతి పేరుతో దోపిడీనే..
జూన్ 4న వెన్నుపోటు డే
కిందటి ఏడాది జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు ఎలాంటి హామీ నెరవేర్చలేదు. అందుకే చంద్రబాబు మోసాలకు గుర్తుగా ఆ రోజున వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటాం. కలెక్టర్లకు హామీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం.
లిక్కర్ స్కాం పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందా? అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా.. ‘‘నాకు పోరాటాలు కొత్త కాదు. గతంలో రెండు పార్టీలు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా న్యాయమే గెలుస్తుంది. గతంలో ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా వైఎస్సార్‌సీపీ పుట్టింది.. పెరిగింది.. ఎదిగింది. న్యాయం, ధర్మం వైపే దేవుడు ఉంటాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు.