సచివాలయాల్లో నిత్య నరకం | - | Sakshi
Sakshi News home page

సచివాలయాల్లో నిత్య నరకం

Mar 2 2026 8:16 AM | Updated on Mar 2 2026 8:16 AM

సచివాలయాల్లో నిత్య నరకం

సచివాలయాల్లో నిత్య నరకం

సచివాలయాల్లో నిత్య నరకం

విశ్రాంతి కూడా కరువు

ప్రభుత్వ లక్ష్యాలు, అధికారుల వేధింపులతో తీవ్ర మానసిక క్షోభ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ శాఖలోనే ఆకస్మిక మరణాలు ఏడేళ్లయినా దక్కని పదోన్నతులు సెలవు దినాల్లోనూ తప్పని విధులు

ప్రాణాలు తీస్తున్న పని ఒత్తిడి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జాబ్‌చార్ట్‌ ప్రకారం ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి పనులు అప్పగించలేదు. ఆ తర్వాత నుంచి క్షణం తీరిక లేకుండా పనులు అప్పగించి తీవ్ర మానసిక ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ సర్వే జరిగినా అది సచివాలయ ఉద్యోగులే చేయాలనే దుస్థితి నెలకొంది.

నెహ్రూనగర్‌: ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే–2025, పీ–4 సర్వే (పేదరిక నిర్మూలన), అక్షరాంధ్ర, ఈకేవైసీ, పల్స్‌ సర్వే.. ఇలా ప్రతిదీ సచివాలయ ఉద్యోగుల నెత్తినే పడుతోంది. ఉదయం 6 గంటలకే పారిశుద్ధ్య పనుల పరిశీలన, పింఛన్ల పంపిణీకి వెళ్లాల్సి వస్తోంది. వీటితోపాటు ట్యాప్‌ కనెక్షన్లు, బాత్రూమ్‌ ఫొటోలు తీయడం, ఇళ్లకు స్టిక్కర్లు అంటించడం వంటి పనులు అప్పగిస్తున్నారు. వార్డు కార్యదర్శులకై తే సర్వేలతోపాటు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలు విధించి, సమీక్షల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. ఓ వైపు సర్వేల ఒత్తిడి, మరో వైపు విధుల నిర్వహణతో సతమతమవుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలను అందిస్తున్నా చిన్నపాటి కారణాలు చూపిస్తూ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు.

రాజకీయ విమర్శలు

అధికార కూటమి నేతలు సచివాలయాలను ’దరిద్రాలయాలు’ అని, ఉద్యోగులను ‘ఎందుకూ పనికిరారు’ అని దుర్భాషలాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తీరా చూస్తే ప్రభుత్వ ప్రచారాలకు, ప్రతి నెలా సర్వేలకు సచివాలయ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం వాడుకుంటోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అని పేర్లు మార్చి ఉద్యోగుల విధులను మాత్రం అస్తవ్యస్తం చేసింది.

జిల్లాలో 568 సచివాలయాలు

ప్రజలకు ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను చేరువ చేసే ఉద్దేశంతో 2019 ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 29 ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 543 రకాల ఈ– సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 568 సచివాలయాలు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 5,563 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

అగమ్యగోచరం

గ్రామ, పట్టణ స్థాయిల్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. సంబంధం లేని పనులన్నీ సచివాలయ సిబ్బంది నెత్తిన రుద్దుతుండటంతో పనిభారంతో వారు అల్లాడిపోతున్నారు. ఒక వైపు గతంలో వలంటీర్లు చేసిన పనులు, మరో వైపు రోజుకో కొత్త సర్వేతో సిబ్బంది తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి మార్చుకోవాలని కోరారు.

సర్వీసుపరంగా ఏడో ఏట అడుగుపెడుతున్నా సచివాలయ ఉద్యోగులకు నేటికీ ఎలాంటి పదోన్నతులు లేవు. జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ నెరవేరలేదు. కనీసం సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా పనులు పురమాయిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలు దాటిన తర్వాత కూడా డిప్యూటీ కమిషనర్లు, తహసీల్దార్లు గంటల తరబడి మీటింగులు పెడుతుండటంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా వీరికి మాత్రమే బయోమెట్రిక్‌ హాజరును జీతాలతో ముడిపెట్టడం గమనార్హం.

రాష్ట్రంలో 75 శాఖలు ఉండగా, అత్యధికంగా సచివాలయ శాఖలోనే ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష్యాలు చేరుకోలేక, అధికారుల చీవాట్లు పడలేక కొందరు రాజీనామా చేస్తుంటే, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ట్విట్టర్‌ క్యాంపెయిన్‌ ప్రకారం.. ఒత్తిడి తట్టుకోలేక సుమారు 40 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఒక సమయంలో ఒకే పని ఇవ్వాలని, సీనియారిటీ జాబితా రూపొందించి ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement