
వైఎస్సార్, సాక్షి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకూ టీడీపీకి తిప్పికొడుతుందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి హెచ్చరించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను శనివారం పరామర్శించిన జగన్.. ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు.
‘‘వైఎస్సార్‌సీపీకి ఓటేశారని 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. చంద్రబాబు రాష్ట్రంలో భయాకన వాతావరణం సృష్టిస్తున్నారు. శిశుపాలుడి పాపాల మాదిరి ఆయన పాపాలు పండుతున్నాయి. అధికారం మారిన రోజున.. ఆ పాపాలు తన చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు.
చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే పది శాతం ఓట్లు పడ్డాయన్న జగన్.. రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టిసారించాలని, నాయకులుగా ఉన్న మనం ఎప్పుడూ ఇలాంటి దాడుల సంస్కృతిని ప్రొత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకి జగన్ హితవు పలికారు.
వేంపల్లెలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా మూడు రోజుల పర్యటనకు వచ్చిన జగన్ కార్యకర్త దాడి గురించి తెలుసుకున్నారు. నేరుగా కడప ఎయిర్‌పోర్ట్ నుంచి రిమ్స్‌కు వెళ్లారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని అజయ్‌కు ఆయన భరోసా ఇచ్చారు.
