సాక్షి, వైఎస్సార్: కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
2019లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్) సంస్థను వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పించిందని అవినాష్ రెడ్డి అన్నారు. 2022లో ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి జీవో జారీ చేయడంతో పాటు భూసేకరణ కూడా పూర్తిగా జగన్ హయాంలోనే జరిగిందని తెలిపారు. ప్రాజెక్టు కోసం 1100 ఎకరాల భూకేటాయింపు కూడా ఫేజ్–1లోనే చేపట్టినట్లు వివరించారు.
2023 ఫిబ్రవరిలో సీఎం వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి గుర్తుచేశారు. అంతేకాకుండా పర్యావరణ అనుమతులు సహా అవసరమైన అన్ని క్లియరెన్సులు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యూ సంస్థ అధినేత జిందాల్ స్వయంగా వెల్లడించారాన్నారు.
కడప సభలో ఈ ప్రాజెక్టుపై తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ అవినాష్ తప్పుబట్టారు.“ఫ్యాక్టరీని తానే తెచ్చానని చెప్పుకుంటూ క్రెడిట్ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని విమర్శించారు. సభ స్టీల్ ఫ్యాక్టరీ కోసం కాకుండా.. కేవలం వైఎస్ జగన్‌ను దూషించడానికే పెట్టినట్లు ఉందని అన్నారు.
అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాజెక్టుపై కూడా అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని, అది ఒక వర్గానికి చెందిన రాజధానిగా మారిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని.. అమరావతి కోసం సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ మాత్రం మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను కలిపే “మావిగన్” వంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రతిపాదించారని తెలిపారు.


