Womens Reservation Bill 2023: ఓబీసీలను అధికారానికి దూరం చేశారు | Sakshi
Sakshi News home page

Womens Reservation Bill 2023: ఓబీసీలను అధికారానికి దూరం చేశారు

Published Sat, Sep 23 2023 6:08 AM

Womens Reservation Bill 2023: Rahul Gandhi speaks on OBC and caste census - Sakshi

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీయే హయాంలో తాము ప్రతిపాదించిన బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తామని పేర్కొనపోవడం పట్ల తనకిప్పటికీ ఎంతగానో ఆవేదనగా ఉందని చెప్పారు. ఇప్పుడు వారికి రిజర్వేషన్‌ కోసం పట్టుబడతామని ఒక ప్రశ్నకు బదులుగా స్పష్టం చేశారు.

మోదీ సర్కారు ఫక్తు రాజకీయ కారణాలతోనే మహిళా బిల్లు తెచి్చందని ఆరోపించారు.  మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీలకు ప్రత్యేక కోటా పెట్టకపోవడం ద్వారా వారిని అధికారానికి దూరం చేసిందని రాహుల్‌ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం తక్షణం కుల గణన చేపట్టి, ఆ వివరాలను అందరికీ తెలిసేలా బహిరంగపరచాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ఇతర సామాజిక వర్గాల మహిళలకు కూడా వారి జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

దృష్టి మళ్లించే నాటకమే
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను అధికార బీజేపీ ప్రతిపాదించినప్పుడు తాము ఆహ్వానించామని రాహుల్‌ అన్నారు. ‘ఆ సందర్భంగా ఎంపీలమంతా అట్టహాసంగా పార్లమెంటు పాత భవనంలో నుంచి కొత్త భవనంలోకి మారాం కూడా. మోదీ కూడా అత్యంత నాటకీయ ఫక్కీలో రాజ్యాంగ ప్రతిని చేబూనారు. ’అతి ముఖ్యమైన బిల్లును ఆమోదించబోతున్నాం, అంతా సహకరించండి’ అని అన్నారు. ఆయన ప్రతిపాదించిన మహిళా బిల్లు నిస్సందేహంగా వారి సాధికారత దిశగా కీలక అడుగు. కానీ జన గణన, డీ లిమిటేషన్‌ రూపంలో రెండు మెలికలు పెట్టారు. వాటివల్ల అది మరో పదేళ్లకు గానీ అమల్లోకి రాదు. ఇది ఫక్తు సమస్యల నుంచి దృష్టి మళ్లించే కుట్రే‘ అని ఆరోపించారు.

అధిక సంఖ్యాకులకు అధికారమేది?
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలో కేవలం ముగ్గురు ఓబీసీలు మాత్రమే ఉన్నారని తెలిసి తాను షాకయ్యానని రాహుల్‌ అన్నారు. ‘ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు కలిపి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కేవలం ఆరు శాతం! ప్రధాని మోదీ మాట్లాడితే తాను ఓబీసీ నేతను అంటుంటారు. వారి చేతుల్లో అధికారం లేని ఈ దురవస్థకు కారణం ఏమిటో ఆయనే చెప్పాలి.  ఈ చేదు నిజాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు దేశంలో ఓబీసీలు ఎందరు? ఇతర సామాజికవర్గాల వారు ఎందరు? ఇవిప్పుడు కీలక ప్రశ్నలు. అందుకే మేం కుల గణనకు డిమాండ్‌ చేస్తున్నాం‘ అని చెప్పారు. ‘దేశ ప్రజలకు అధికారాన్ని బదలాయించాలంటే ఈ సామాజిక గణాంకాలు తెలియడం చాలా అవసరం. జన గణన ఇప్పటికే జరిగింది గనుక ఈ లెక్కలన్నీ ఇప్పటికే కేంద్రం వద్ద అన్నాయి. ప్రధాని మోదీ వాటిని ఎందుకు విడుదల చేయడం లేదు?‘ అని రాహుల్‌ ప్రశ్నించారు.

వారికి భాగస్వామ్యం ఉందా?
తమ పార్టీలో అత్యధిక సంఖ్యలో ఓబీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారన్న బీజేపీ వాదనను రాహుల్‌ ఎద్దేవా చేశారు. ‘చట్టాల రూపకల్పనలో, దేశ  ద్రవ్య వినిమయంలో వారు ఏ మేరకు పాలుపంచుకుంటున్నారో అడగండి. అసలే లేదని వారే అంగీకరిస్తారు‘ అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే లోక్‌ సభలో బీజేపీ ఎంపీలకు వాస్తవంలో ఎలాంటి  అధికారాలూ లేవని రాహుల్‌ అన్నారు. వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నారన్నారు. ఒక బీజేపీ ఎంపీయే తనకు ఈ విషయం చెప్పారన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

Advertisement
Advertisement