10 వేల‌ కోట్ల వ్యాపార‌వేత్త‌కు.. ఆప్ ఎంపీ టికెట్‌ | Who is Rajinder Gupta Aam Aadmi Party Rajya Sabha pick | Sakshi
Sakshi News home page

ఆప్ ఎంపీ టికెట్‌.. ఎవ‌రీ రాజిందర్ గుప్తా?

Oct 7 2025 7:46 PM | Updated on Oct 7 2025 8:14 PM

Who is Rajinder Gupta Aam Aadmi Party Rajya Sabha pick

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఓ బిలియ‌నీర్‌కు రాజ్య‌స‌భ సీటు ఇచ్చింది. పంజాబ్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన రాజిందర్ గుప్తాను పార్ల‌మెంట్ ఎగువ స‌భ‌కు పంపించాల‌ని నిర్ణ‌యించింది. అక్టోబర్ 24న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో త‌మ పార్టీ త‌ర‌పున ప్రముఖ పారిశ్రామికవేత్త రాజిందర్ గుప్తా పోటీ చేస్తార‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ ఆయ‌న‌ను రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపిక చేసిన‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న‌లో ఆప్ వెల్ల‌డించింది.

ఎంపీ సంజీవ్ అరోరా(Sanjeev Arora) రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరోరా.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో ఎంపీ ప‌ద‌విని వ‌దులుకున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఆయ‌న ప‌ద‌వీ కాలం 2028, ఏప్రిల్ 9 వ‌ర‌కు ఉంది. ఆయ‌న రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. రాజ్య‌స‌భ‌కు రాజిందర్ గుప్తా పోటీ చేస్తార‌ని ముందు నుంచే స్థానిక మీడియాలో ఊహాగానాలు వెలువ‌డ్డాయి. రాష్ట్ర ఆర్థిక విధానం, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్ష పదవితో పాటు కాళీ దేవి ఆలయ సలహా కమిటీ అధ్యక్ష పదవికి ఆయ‌న‌ రాజీనామా చేయ‌డంతో ఈ వార్త‌లకు బ‌లం చేకూరింది.

రాజిందర్ గుప్తా ఎవరు?
ట్రైడెంట్ గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కుడైన‌  66 ఏళ్ల రాజిందర్ గుప్తా (Rajinder Gupta) పంజాబ్ రాష్ట్రానికి చెందిన‌ అత్యంత ధనవంతుల్లో ఒకరు. 2025లో (ఫోర్బ్స్ జాబితా) ఆయ‌న ఆస్తుల‌ నికర విలువ $1.2 బిలియన్లు, అంటే దాదాపు ₹10,000 కోట్లు. బటిండాలో పత్తి వ్యాపారి నోహర్ చంద్ దంపతులకు గుప్తా జన్మించారు. సాధార‌ణ జీవితం నుంచి ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగారు. ట్రైడెంట్ లిమిటెడ్ పేరుతో లూథియానాలో కంపెనీ పెట్టి వివిధ రంగాల‌కు వ్యాపారాన్ని విస్త‌రించారు. టెక్స్‌టైల్‌, పేప‌ర్‌, కెమిక‌ల్ త‌యారీ రంగాల్లో ట్రైడెంట్ ప్ర‌ముఖ కంపెనీగా ఎదిగింది. ఆరోగ్య కారణాలతో ట్రైడెంట్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి 2022లో వైదొలిగారు. వాణిజ్యం, పరిశ్రమ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2007లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీతో పుర‌స్కారం అందుకున్నారు.

కాంగ్రెస్, అకాలీద‌ళ్ హ‌యాంలోనూ..
రాజిందర్ గుప్తా అనేక ప్రభుత్వ విభాగాలలో కీలక పదవులలో పని చేయడం ద్వారా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2022లో ఆప్‌ అధికారంలోకి వచ్చాక‌.. పంజాబ్ రాష్ట్ర ఆర్థిక విధానం- ప్రణాళిక బోర్డు వైస్-చైర్మన్‌గా ఆయ‌న‌ నియమితులయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో కాళీ దేవి ఆల‌య‌ సలహా కమిటీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు చేప‌ట్టారు. గతంలో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్-బీజేపీ ప్ర‌భుత్వ హ‌యాల్లోనూ రాష్ట్ర ఆర్థిక విధానం- ప్రణాళిక బోర్డు వైస్- చైర్మన్‌గా ప‌నిచేశారు. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లకు FICCI సలహా మండలి చైర్‌పర్సన్‌గా గ‌తంలో వ్య‌వ‌హ‌రించారు. చండీగఢ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల గవర్నర్ల బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు.

ఎన్నిక లాంఛ‌న‌మే
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Aadmi Party) మెజారిటీ స‌భ్యులు ఉండ‌డంతో రాజిందర్ గుప్తా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కావ‌డం లాంఛ‌న‌మే. 117 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 93 ఎమ్మెల్యేలు ఉన్నారు.

24న పోలింగ్ 
ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 6న ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 16. పోలింగ్ 24న జ‌రుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది.

చ‌ద‌వండి: ఫ‌స్ట్ టైమ్ కొన్న లాట‌రీ టికెట్‌తోనే 25 కోట్ల జాక్‌పాట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement