రంపచోడవరం పోలీస్ స్టేషన్‌లో ఆయుధాలు పరిశీలిస్తున్న డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం
దేవ్‌జీ, మల్ల రాజారెడ్డి పోలీసుల అదుపులో లేరు
రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
రంపచోడవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఏపీ పోలీసు శాఖ పని చేస్తున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా చెప్పారు. మావోయిస్టుల ఏరివేతకు ‘ఆపరేషన్ సంభవ్’ కొనసాగుతుందని స్పష్టంచేశారు. మావోయిస్టుల వైపు వెళ్లే ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. మావోయిస్టు నాయకులు దేవ్‌జీ, మల్ల రాజారెడ్డి పోలీసుల అదుపులో లేరని చెప్పారు. డీజీపీ గురువారం రంపచోడవరంలో పర్యటించారు. అనంతరం
ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... వరుసగా రెండు రోజులపాటు జరిగిన ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతిచెందారని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు హిడ్మా, టెక్ శంకర్ వంటి వారు మరణించారని చెప్పారు. ఘటనాస్థలాల్లో అధిక సంఖ్యలో ఆయుధాలు లభ్యమయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సమన్వయంతో పనిచేయడం వల్ల మంచి ఫలితం వచ్చిందన్నారు. 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే పోలీస్ శాఖ అంతిమ లక్ష్యమని డీజీపీ చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలు మృతిచెందారని, అప్పుడే మావోయిస్టులు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరామని పేర్కొన్నారు.
హెలికాప్టర్ నుంచి అటవీ ప్రాంతంలో పరిశీలన
విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తొలుత మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గుర్తేడు, పాతకోటతోపాటు తాజాగా మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన జీఎం వలస అటవీ ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు.


