
అమృత్‌సర్: పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ లాల్‌పురాకు తార్న్‌తరణ్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2013లో ఓ దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనపై 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. రెండు రోజుల క్రితం న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది.
మంజీందర్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి 2022లో ఎమ్మెల్యేగా గెలిచారు. లైంగిక వేధింపుల కేసులో మంజీందర్ సింగ్‌తోపాటు మరో ఆరుగురు సైతం దోషులుగా తేలారు. వారికి సైతం నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ప్రేమ్‌కుమార్ తీర్పు వెలువరించారు. 2013లో నేరం జరిగిన సమయంలో మంజీందర్ సింగ్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుండడం గమనార్హం.