breaking news
Rajya Sabha by-election
-
10 వేల కోట్ల వ్యాపారవేత్తకు.. ఆప్ ఎంపీ టికెట్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓ బిలియనీర్‌కు రాజ్యసభ సీటు ఇచ్చింది. పంజాబ్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన రాజిందర్ గుప్తాను పార్లమెంట్ ఎగువ సభకు పంపించాలని నిర్ణయించింది. అక్టోబర్ 24న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త రాజిందర్ గుప్తా పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు అధికారిక ప్రకటనలో ఆప్ వెల్లడించింది.ఎంపీ సంజీవ్ అరోరా(Sanjeev Arora) రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరోరా.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఎంపీ పదవిని వదులుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం 2028, ఏప్రిల్ 9 వరకు ఉంది. ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజ్యసభకు రాజిందర్ గుప్తా పోటీ చేస్తారని ముందు నుంచే స్థానిక మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. రాష్ట్ర ఆర్థిక విధానం, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్ష పదవితో పాటు కాళీ దేవి ఆలయ సలహా కమిటీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.రాజిందర్ గుప్తా ఎవరు?ట్రైడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడైన 66 ఏళ్ల రాజిందర్ గుప్తా (Rajinder Gupta) పంజాబ్ రాష్ట్రానికి చెందిన అత్యంత ధనవంతుల్లో ఒకరు. 2025లో (ఫోర్బ్స్ జాబితా) ఆయన ఆస్తుల నికర విలువ $1.2 బిలియన్లు, అంటే దాదాపు ₹10,000 కోట్లు. బటిండాలో పత్తి వ్యాపారి నోహర్ చంద్ దంపతులకు గుప్తా జన్మించారు. సాధారణ జీవితం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ట్రైడెంట్ లిమిటెడ్ పేరుతో లూథియానాలో కంపెనీ పెట్టి వివిధ రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. టెక్స్టైల్, పేపర్, కెమికల్ తయారీ రంగాల్లో ట్రైడెంట్ ప్రముఖ కంపెనీగా ఎదిగింది. ఆరోగ్య కారణాలతో ట్రైడెంట్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి 2022లో వైదొలిగారు. వాణిజ్యం, పరిశ్రమ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2007లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీతో పురస్కారం అందుకున్నారు.కాంగ్రెస్, అకాలీదళ్ హయాంలోనూ..రాజిందర్ గుప్తా అనేక ప్రభుత్వ విభాగాలలో కీలక పదవులలో పని చేయడం ద్వారా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2022లో ఆప్ అధికారంలోకి వచ్చాక.. పంజాబ్ రాష్ట్ర ఆర్థిక విధానం- ప్రణాళిక బోర్డు వైస్-చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో కాళీ దేవి ఆలయ సలహా కమిటీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. గతంలో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వ హయాల్లోనూ రాష్ట్ర ఆర్థిక విధానం- ప్రణాళిక బోర్డు వైస్- చైర్మన్‌గా పనిచేశారు. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లకు FICCI సలహా మండలి చైర్‌పర్సన్‌గా గతంలో వ్యవహరించారు. చండీగఢ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల గవర్నర్ల బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు.ఎన్నిక లాంఛనమేపంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Aadmi Party) మెజారిటీ సభ్యులు ఉండడంతో రాజిందర్ గుప్తా రాజ్యసభకు ఎన్నిక కావడం లాంఛనమే. 117 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 93 ఎమ్మెల్యేలు ఉన్నారు.24న పోలింగ్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 6న ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 16. పోలింగ్ 24న జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది.చదవండి: ఫస్ట్ టైమ్ కొన్న లాటరీ టికెట్‌తోనే 25 కోట్ల జాక్‌పాట్! -
రాజ్యసభకు టీఎంసీ అభ్యర్థిగా జవహర్ సర్కార్
కోల్‌కతా: ఆగస్టు 9వ తేదీన పశ్చిమబెంగాల్ రాజ్యసభ సీటుకు జరగనున్న ఉప ఎన్నికకు రిటైర్డు ప్రభుత్వాధికారి జవహర్ సర్కార్(69)ను తమ అభ్యర్థిగా టీఎంసీ ఎంపిక చేసింది. అధికారిగా ప్రజలకు అమూల్యమైన సేవలందించిన సర్కార్ దేశానికి మరింతగా సేవ చేసేందుకు సహాయపడతారని ఆశిస్తూ ఎంపిక చేసినట్లు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కాగా, టీఎంసీ నేత దినేశ్ త్రివేది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో సీటు ఖాళీ అయింది. టీఎంసీకి పోటీగా బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించితే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. లేకుంటే రాజ్యసభకు జవహర్ సర్కార్ పోటీ లేకుండానే ఎన్నికవుతారు. సర్కార్ ప్రభుత్వ ఉద్యోగిగా 42 ఏళ్లపాటు పనిచేశారు. -
కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్: ఆ సీటు కమలం ఖాతాలోకి
అహ్మదాబాద్: పుదుచ్చేరిలో అధికారంలో కోల్పోయి షాక్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. పార్టీకి నమ్మిన బంటుగా పని చేసిన అహ్మద్ పటేల్ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది. ఆయన మృతితో ఏర్పడిన రాజ్యసభ స్థానాన్ని కాషాయ పార్టీ దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ బలం రాజ్యసభలో తగ్గింది. బీజేపీ వివిధ మార్గాల ద్వారా రాజ్యసభలో బలం పెంచుకుంటోంది. గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న అహ్మద్ పటేల్, అభయ్ భరద్వాజ్ అనారోగ్యంతో గతేడాది మృతిచెందారు. అయితే గుజరాత్లో అధికార పార్టీగా ఉన్న బీజేపీ పక్కా వ్యూహంతో అడుగులు వేయడంతో ఆ రెండు ఎంపీ స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. ఎమ్మెల్యేల ఓటింగ్‌తో రాజ్యసభ స్థానాలు కమల దళానికి దక్కాయి. దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఆ స్థానాల్లో దినేశ్‌చంద్ర జెమల్‌భాయ్ అనవడియా, రామ్‌భాయ్ మోకారియా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అహ్మద్ పటేల్ స్థానంలో దినేశ్ చంద్ర గెలుపొందగా.. అభయ్ స్థానంలో రామ్‌భాయ్ గెలిచారు. దీంతో బీజేపీ గుజరాత్లో పట్టు నిలుపుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
మేము జోక్యం చేసుకోలేం
న్యూఢిల్లీ: గుజరాత్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని, అందువల్ల తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎన్నిక ముగిసిపోయిన తర్వాత కావాలంటే గుజరాత్ కాంగ్రెస్ శాఖ ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను కల్పించింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో గుజరాత్లో రెండు రాజ్య సభ స్థానాలు ఖాళీ అయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయిలతో కూడిన వెకేషన్ బెంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుకి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే అధికారం ఉండదని తెలిపింది. ‘ఈ విషయంలో ప్రాథమిక హక్కులకు ఏ విధంగా భంగం కలిగింది ? ఎన్నికల్లో పోటీ చేయడం ఎవరికైనా చట్టబద్ధంగా వచ్చిన హక్కు. మీరు అవసరం అనుకుంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోండి’ అని న్యాయమూర్తులు గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు పరేశ్‌భాయ్ ధనాని దాఖలు చేసిన పిటిషన్ తరఫున వాదించడానికి కోర్టుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ వివేక్ టాంఖాకు సలహా ఇచ్చారు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 100 స్థానాలుంటే, కాంగ్రెస్‌కు 75 ఉన్నాయి. రాజ్యసభకు నామినేషన్ వేసిన జైశంకర్ గాంధీనగర్: విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ స్థానానికి మంగళవారం నామినేషన్ దాఖలుచేశారు. జై శంకర్ సోమవారమే బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. జైశంకర్‌తోపాటు గుజరాత్ బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు జుగల్జీ ఠాకూర్ గుజరాత్ రాజ్యసభ మరో స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అమిత్ షా, స్మృతీ ఇరానీ ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికకావడంతో రెండు రాజ్యసభ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. -
రజనీ అభిమాని నామినేషన్
చెన్నై, సాక్షి: రాజ్యసభ ఉప ఎన్నికల్లో రజనీ కాంత్ అభిమాని ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. విరుదునగర్‌కు చెందిన మన్మథన్ రజనీకాంత్ వీరాభిమాని. తమ కథానాయకుడు రాజకీయాల్లోకి రావాలని కోరుతూ పలు ఎన్నికల్లో నామినేషన్లు వేయడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు 35 సార్లు స్వతంత్య్ర అభ్యర్థిగా పలు ఎన్నికల్లో నామినేషన్ వేసి ఈ అభిమాని ఏకంగా బుధవారం రాజ్యసభ రేసులో తాను ఉన్నానంటూ నామినేషన్ వేశారు. అయితే ఎమ్మెల్యేల మద్దతు లేని దృష్ట్యా ఈ నామినేషన్ పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు.