మేము జోక్యం చేసుకోలేం

Setback for Congress, SC refuses to interfere in Gujarat RajSabha elections - Sakshi

గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల పిటిషన్‌ విచారణకు సుప్రీం నో  

న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని, అందువల్ల తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎన్నిక ముగిసిపోయిన తర్వాత కావాలంటే గుజరాత్‌ కాంగ్రెస్‌ శాఖ ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకునే స్వేచ్ఛను కల్పించింది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, స్మృతి ఇరానీలు లోక్‌సభకు ఎన్నిక కావడంతో గుజరాత్‌లో రెండు రాజ్య సభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, బీఆర్‌ గవాయిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కోర్టుకి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే అధికారం ఉండదని తెలిపింది. ‘ఈ విషయంలో ప్రాథమిక హక్కులకు ఏ విధంగా భంగం కలిగింది ? ఎన్నికల్లో పోటీ చేయడం ఎవరికైనా చట్టబద్ధంగా వచ్చిన హక్కు. మీరు అవసరం అనుకుంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోండి’ అని న్యాయమూర్తులు గుజరాత్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష నాయకుడు పరేశ్‌భాయ్‌ ధనాని దాఖలు చేసిన పిటిషన్‌ తరఫున వాదించడానికి కోర్టుకు వచ్చిన సీనియర్‌ అడ్వకేట్‌ వివేక్‌ టాంఖాకు సలహా ఇచ్చారు.  182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీలో  బీజేపీకి 100 స్థానాలుంటే, కాంగ్రెస్‌కు 75 ఉన్నాయి.

రాజ్యసభకు నామినేషన్‌ వేసిన జైశంకర్‌
గాంధీనగర్‌: విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జై శంకర్‌ గుజరాత్‌ నుంచి రాజ్యసభ స్థానానికి మంగళవారం నామినేషన్‌ దాఖలుచేశారు. జై శంకర్‌ సోమవారమే బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే.  జైశంకర్‌తోపాటు గుజరాత్‌ బీజేపీ ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు జుగల్జీ ఠాకూర్‌ గుజరాత్‌ రాజ్యసభ మరో స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. అమిత్‌ షా, స్మృతీ ఇరానీ ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికకావడంతో రెండు రాజ్యసభ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top