
లక్ అంటే అతడిదే. ఎంతో మందికి ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్నా దక్కని అదృష్టం.. అతడిని మాత్రం వెంటనే వరించింది. ఫస్ట్ టైమ్ కొన్న లాటరీ టికెట్‌తోనే ఓవర్‌నైట్ కోటీశ్వరుడు అయిపోయాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 25 కోట్ల రూపాయల బంఫర్ లాటరీ కొట్టాడు. 'నువ్వు చాలా లక్కీ బ్రో' అంటూ నెటిజనులు అతడికి విషెస్ చెబుతున్నారు. ఇంతకీ ఎవరతను?
అలప్పుజ (కేరళ): అలప్పుజ జిల్లా తైకట్టుస్సేరీ నివాసి శరత్ నాయర్.. తిరువోణం బంపర్ లాటరీలో (Thiruvonam Bumper lottery) రూ.25 కోట్ల బహుమతిని గెలుచుకున్నారు. ఈ మేరకు నాయర్ సోమవారం తన లాటరీ టికెట్‌ను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తురవూర్ శాఖ కార్యాలయానికి అందజేశారు. ‘టీహెచ్ 577825’నంబరు గల ఈ టికెట్‌ను ఆయన ఏజెంట్ లతీష్‌కుకు చెందిన లాటరీ రిటైల్ అవుట్‌లెట్‌లో కొనుగోలు చేశారు. ‘అక్టోబర్ 3న ఫలితాలు ప్రకటించినప్పుడు ఆ విజేత టికెట్ నా దగ్గరే ఉందని నమ్మలేకపోయాను. తరువాత, ఇంటికి వెళ్లి టికెట్‌ను పరిశీలించి నిర్ధారించుకున్నాను’.. అని నాయర్ తెలిపారు.
‘నేను బంపర్ టికెట్ కొనడం ఇదే మొదటిసారి. చిన్న లాటరీ టిక్కెట్లు ఎప్పుడో కానీ కొనను’.. అని శరత్ నాయర్ (Sarath Nair) స్పష్టం చేశారు. రూ.25 కోట్ల మొత్తంతో ఏం చేస్తారని ప్రశ్నించగా.. తానింకా ఏం నిర్ణయించుకోలేదన్నారు. తనకున్న అప్పులు తీర్చాక.. కుటుంబంతో కలిసి భవిష్యత్తు గురించి చర్చిస్తానని పేర్కొన్నారు. పెయింట్ షాప్‌లో ఇంకా పనిచేస్తారా? అని ప్రశ్నించగా.. 12 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నానని, అక్కడే కొనసాగుతానని సమాధానమిచ్చారు. కేరళ రాష్ట్ర లాటరీల విభాగం నిర్వహించే లాటరీలన్నిటిలోనూ.. అత్యధిక మొత్తం మొదటి బహుమతి తిరువోణం బంపర్‌దే కావడం విశేషం.