కడియంను వదిలే ప్రసక్తే లేదు.. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య | Sakshi
Sakshi News home page

కడియంను వదిలే ప్రసక్తే లేదు.. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య

Published Fri, Apr 19 2024 5:09 PM

Warangal: Thatikonda Rajaiah Challenge To Kadiyam Srihari - Sakshi

సాక్షి, వరంగల్‌: ఓరుగల్లులో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవి పక్కదేశం పాకిస్థాన్ వైపు దూసుకెళ్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి శివమెత్తారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి పై నిప్పులు చెరిగారు. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య కడియం శ్రీహరిని భూస్థాపితం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు.. ఒకవైపు మాటల తూటాలు మరోవైపు తనదైన శైలిలో స్టెప్పులేసి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు.

హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈల కొట్టి స్టెప్పులేసిన రాజయ్య.. కేసీఆర్‌ పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి, బిఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. రాజయ్యతో పాటు, అక్కడే ఉన్న నేతలు సైతం స్టెప్పులు వేశారు.

బీఆర్ఎస్ పార్టీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న తాటికొండ రాజయ్య ఇప్పుడు ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్‌గా మారారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కడియం శ్రీహరిపై రాజయ్య రంకెలేస్తున్నారు. ఈ మేరకు తొడగొట్టి సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే.. నమ్మకద్రోహం చేసిన కడియం  అంతుచూస్తా.. నిన్ను భూ స్థాపితం చేయడమే నా లక్ష్యం అని అన్నారు. కడియంకు నిజాయితీ ఉంటే రాజీనామా చేసి రా చూసు కుందాం అని మీసం మెలేసి సవాల్ విసిరారు.
చదవండి: కేసీఆర్‌ కథలకు కాలం చెల్లింది: రేవంత్‌ కౌంటర్‌

‘తెలుగు రాష్ట్రాల్లో అంతా మన ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నారు. దమ్ముంటే రా అని సవాల్ విసిరారు. నాకు నేనుగా.. రాజకీయ ఆత్మహత్య చేసుకునేలా చేసిన దుర్మార్గుడు కడియం నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి అభయహస్తం అంటున్నాడు.. కానీ కడియం శ్రీహరి లాంటి భస్మాసురుడు పక్కన చేరాడు జాగ్రత్త. నాకున్న పని కేవలం నున్ని తొక్కుడే. దళిత ద్రోహి.. కల్నాయక్, నమ్మకద్రోహి.. డిక్టేటర్.. గుంటనక్క.. కడియం శ్రీహరి’ అంటూ నిప్పులు చెరిగారు.

రాజయ్య మాటల తూటాలు పక్క దేశం పాకిస్థాన్ వరకు వెళ్తున్నాయి. కడియం శ్రీహరిని ఇక్కడ తొక్కితే పాకిస్తాన్‌లో తేలాలని ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాలు మన గురించి చూస్తున్నాయని, ఇద్దరం పోటిచేసి చేసి తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు.

Advertisement
 
Advertisement