కేసీఆర్‌ కథలకు కాలం చెల్లింది: రేవంత్‌ కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వైపు చూస్తే నీ సంగతేంటో చూస్తాం: రేవంత్‌ కౌంటర్‌

Published Fri, Apr 19 2024 3:40 PM

CM Revanth Reddy Counter To KCR Comments On Congress MLAs - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: కేసీఆర్‌ వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌ను ముట్టుకుంటే షాక్‌ కొడుతుందని, తాను హైటెన్షన్‌ వైర్‌ లాంటివాడినని చెప్పారు. కేసీఆర్‌ కథలకు కాలం చెల్లిందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి తనకు ఉందన్నారు.

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్టుగడ్డ చైరస్తా నుంచి క్లాక్ టవర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌ మాట్లాడుతూ.. పార్లమెంటులో నోరు లేకపోయినా, పాలమూరులో ఇల్లు లేకపోయినా 2009 లోక సభ ఎన్నికల్లో కేసీఆర్‌నును పాలమూరు ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. అయినా కేసీఆర్‌ పాలమూరు జిల్లాకు ఏం చేయలేకపోయారని విమర్శించారు.

కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న పాలమూరులో ప్రాజెక్టులు కట్టలేదని, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సహకరించలేదని దుయ్యబట్టారు. పరిశ్రమలు కూడా కట్టలేదని మండిపడ్డారు. ఎంపీ శ్రీనివాస్‌ రెడ్డి పార్లమెంట్‌లో ఏరోజు పాలమూరు గురించి మాట్లాడలేదని విమర్శించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

‘ప్రజలు కారును బొంద తీసి పాతిపెట్టారు. కారును తూకం పెట్టి అమ్ముడే. రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్.  మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ వైపు చూస్తూ నీ సంగతేంటో చూస్తాం. మా ఎమ్మెల్యేలను ముట్టుకో చుద్దాం. ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటా. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం. స్వయం సహాయక బృందాలతో మహిళా సంఘాలను ఆదుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం.
చదవండి: లోక్‌సభ ఎన్నికల హడావిడి.. నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్ధులు

కేంద్రం నుంచి 30 వేల కోట్లు రాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గజ్వేల్ దొరలు-గద్వాల గడీల దొరసాని ప్రజలను బానిసల్లాగా మార్చుకున్నారు. 70 ఏళ్లలో పాలమూరుకి మంత్రి పదవి ఇవ్వడానికి మీన మేషాలు లెక్క పెట్టారు. అలాంటిది 70 ఏళ్ల తర్వాత పాలమూరుకి సువర్ణ అవకాశమొచ్చింది. ఎస్సీ వర్గీకరణ సాధించే బాధ్యత మాది. మీ బిడ్డగా అడుగుతున్న. ఒక్కసారి పాలమూరులోని రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించి ఇవ్వండి. 

డీకే అరుణ మోదీ చేతిలో ఉంది. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద శాపనార్ధాలు పెడుతున్నారు. వంద రోజులు కాకమునపే ప్రభుత్వాన్ని కులదోయాలని కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్ కాలం చెల్లింది, కారు షెడ్డుకు పోయింది. నాడు పలుగు పారాబట్టి పాలమూరు నుంచి వలసలు పోయేటోళ్లు. నేడు అదే పాలమూరు బిడ్డ నాయకుడై దేశం నలుమూలలు తిరిగి పాలమూరు ప్రతిష్ట పెంచాడు. పాలమూరు అభివృద్ధి కావాలంటే రెండు ఎంపీ సీట్లు గెలవాల్సిందే. వంశీ చంద్ రెడ్డిని, మల్లు రవిని లక్ష మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి’ అని రేవంత్‌ కోరారు

Advertisement
 
Advertisement