యమునా నీళ్లు.. ఢిల్లీ-హర్యానా మధ్య మాటల యుద్ధం | War Of Words On Yamuna Water Between Delhi Leaders | Sakshi
Sakshi News home page

యమునా నీళ్లు.. ఢిల్లీ-హర్యానా మధ్య మాటల యుద్ధం

Jan 28 2025 1:08 PM | Updated on Jan 28 2025 1:31 PM

War Of Words On Yamuna Water Between Delhi Leaders

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నదిపై ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.  ఢిల్లీ ప్రజలు తాగునీటికి ఉపయోగించే యమునా నదీ జలాల్లో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఈ అంశం పెను దుమారానికి దారి తీసింది. 

యమునా నదీ జలాల్లో విషం కలుపుతున్నారని కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై హర్యానా ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యాఖ్యలకుగాను కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసు పెడతామని హెచ్చరించింది. అయితే.. హర్యానా ప్రభుత్వం కేసు పెడతామని వార్నింగ్‌ ఇవ్వడంపై కేజ్రీవాల్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘నన్ను కేసులతో భయపెట్టలేరు. నా మీద కేసు పెట్టండి. నన్ను చంపండి. ఉరి తీయండి.ఢిల్లీ ప్రజలు తాగే నీళ్లను మాత్రం విషపూరితం చేయకండి. ఢిల్లీ ప్రజలను చంపకండి’అని కేజ్రీవాల్‌ బీజేపీని కోరారు. ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని శపిస్తారు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

కాగా,ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘యమునా నదిలో ఏదో కలుస్తోందని వాటర్‌బోర్డు అనుమానం వ్యక్తం చేసింది. పక్కనున్న హర్యానా ప్రభుత్వం ఢిల్లీ ప్రజలు తాగే నీటిలో విషం కలిపింది. దీంతో కొందరు ఢిల్లీ వాసులు మరణిస్తే అది నాపై నెట్టవచ్చనుకుంటున్నారు’అని కేజ్రీవాల్‌ ఆరోపించారు. 

ఇదే విషయంపై ఢిల్లీ సీఎం అతిషి కూడా స్పందించారు. యమునా నది జలాల్లో అమ్మోనియా స్థాయి అధికంగా ఉందని, వాటిని శుద్ధి చేసి తాగునీటిగా మార్చడం అసాధ్యమన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారామె.  ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement