కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం చర్యలేవి? | Vijayashanti comments over brs and bjp | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం చర్యలేవి?

Nov 19 2023 4:27 AM | Updated on Nov 19 2023 4:27 AM

Vijayashanti comments over brs and bjp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని.. అవి తెర ముందు ఒకలా, తెర వెనక మరోలా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీ లు ఒక్కటై బీజేపీ కార్యకర్తలు, ప్రజలు, ఉద్యమకారులను పిచ్చి వాళ్లను చేశాయని.. అందుకే బీజేపీని వీడానని తెలిపారు. శనివారం గాందీభవన్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జి అజయ్‌కుమార్‌లతో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు.

‘‘కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామంటేనే గతంలో బీజేపీలో చేరాను. నెలలు, ఏళ్లు గడిచినా కేసీఆర్‌పై చర్యలు తీసుకోలేదు. ఉద్యమకారులకు ఇచ్చిన మాటను బీజేపీ అధిష్టానం మర్చిపోయింది. కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని తెలంగాణకు వచ్చిన ప్రతీసారి మాట్లాడే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.

కాళేశ్వరంలో అవినీతి జరిగి, మేడిగడ్డ పిల్లర్లు కుంగినా చర్యలు చేపట్టడం లేదేం? మీరు మీరు (బీజేపీ, బీఆర్‌ఎస్‌) ఒక్కటై ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులను పిచ్చోళ్లను చేశాయి. అందుకే బీజేపీకి రాజీనామా చేశాను..’’అని విజయశాంతి పేర్కొన్నారు. బీజేపీ తనను మోసం చేసిందేతప్ప తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరి, పాత మిత్రులను కలుసుకోవడం సంతోషకరంగా ఉందని చెప్పారు. 

ఆ నాయకుడితోనే భూస్థాపితం 
బీజేపీలో ఒక నాయకుడిని మొక్క నాటినట్టు నాటారని, ఆ నాయకుడితోనే బీజేపీ పని భూస్థాపితం అవుతోందని విజయశాంతి వ్యా ఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ వ్యక్తి మీద పెట్టిన అసైన్డ్‌ భూముల కేసు ఏమైందో చెప్పాలని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని ఆ నేత పదేపదే చెప్పారని.. ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చొద్దని చాలా మంది చెప్పినా బీజేపీ అధిష్టానం వినలేదని పేర్కొన్నారు.

బండి సంజయ్‌ను మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్‌ పడిపోయిందన్నారు. తనను తిట్టే హక్కు బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు లేదని.. తాను డబ్బు, పదవులకు లొంగే వ్యక్తిని కాదని చెప్పారు. తన గురువు అద్వానీ అని, ఆయన విలువైన రాజకీయాలు నేర్పారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. 

టీపీసీసీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్‌ కో–ఆర్డినేటర్‌గా నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మరునాడే సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి ఆ పార్టీ కీలక పదవి అప్పగించింది. ఆమెను టీపీసీసీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్‌ కో–ఆర్డినేటర్‌గా నియమించింది. ఈ కమిటీకి మరో 15 మందిని కన్వీనర్లుగా ప్రకటించింది.

ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. కన్వినర్ల జాబితాలో సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, ఎం.కోదండరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ఈరవర్తి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వర్‌రావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేశ్‌ ముదిరాజ్, పారిజాతరెడ్డి, సిద్ధేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీబిన్‌ ఇబ్రహీం మస్కతీ, దీపక్‌ జాన్‌ తదితరులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement