దేశానికి సేవ చేస్తామంటే ఎలా నమ్మాలి?

Union Minister Nirmala Sitharaman Lashed Out On CM KCR - Sakshi

కేసీఆర్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపాటు

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు

రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మోసం చేశారని ధ్వజం

సాక్షి, న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్లలో మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. జీఎస్‌డీపీలో 25 శాతం అప్పులు­న్నాయని, ప్రస్తుతం రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ అన్న కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేశారని ధ్వజమెత్తారు.

నిర్మలా సీతారామన్‌ శనివారం ఢిల్లీలో మీడి­యాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చడంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ వల్ల ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదన్నారు. సీఎం కేసీఆర్‌ తమ పార్టీకి తెలుగును కాదని సంస్కృతం పేరు పెట్టారని అన్నారు. ఈ చర్యతో తెలంగాణ పోయింది.. తెలుగు కూడా పోయిందని విమర్శించారు.

తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని మోసం చేసిన కేసీఆర్‌.. ఇప్పడు దేశోద్ధారణ కోసం బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశానని చెబుతున్నార­న్నారు. ఇలాంటి వారు ఇప్పుడు దేశానికి మంచి చేస్తారంటే అనుమానాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. ఉట్టికి ఎగురలేనమ్మ.. స్వర్గానికి ఎగురుదామనుకున్నట్లు టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు పెంచినా చుక్క నీరు కూడా ప్రజలకు ఇవ్వలేదని విమర్శించారు. 

పదవి పోతుందనే సచివాలయానికి వెళ్లలేదు
కేసీఆర్‌ మహిళలను ఎప్పుడూ గౌరవించలేదని.. మహిళలను కేబినెట్‌లోకి తీసుకుంటే కలిసిరాదని మంత్ర, తంత్రగాళ్లు చెప్పినందునే గతంలో మహిళలకు అవకాశం ఇవ్వలేదని నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. మహిళలకు న్యాయం చేస్తామని చెప్పిన పార్టీ వారికి న్యాయం చేయకపోగా 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళకు కూడా కేబినెట్‌లో చోటు కల్పించలేదన్నారు.

2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక కేవలం ఒక మహిళను మాత్రమే కేబినెట్‌లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ‘ప్రజలు కష్టాల్లో ఉన్నా తాంత్రికులు చెప్పినందుకు సచివాలయానికి వెళ్లను.. ప్రజలకు అందుబాటులో ఉండను. కొత్త పార్టీని పెడతాను. తెలంగాణను మరిచిపోతాను.. తెలుగును కూడా మరిచిపోతాననేలా టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఉంది. సచివాలయానికి వెళ్తే పదవి ఊడుతుందన్న భయంతోనే కేసీఆర్‌ పాత సచివాలయానికి కూడా వెళ్లలేదు’ అని అన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top