TPCC President Revanth Reddy Comments Over KCR Over Bashir Bagh Electricity Movement - Sakshi
Sakshi News home page

‘బషీర్‌బాగ్‌’ సూత్రధారి కేసీఆర్‌

Jul 14 2023 5:16 AM | Updated on Jul 14 2023 11:29 AM

TPCC President Revanth Reddy comments over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజలపై కాల్పులు జరిపించింది అప్పట్లో టీడీపీలో కీలకంగా ఉన్న కేసీఆర్‌ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బషీర్‌బాగ్‌ విద్యుత్‌ ఉద్యమంలో రైతులపై కాల్పులకు సూత్రధారి కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాల్సి ఉంటుందని నాడుచంద్రబాబు అనడానికి కారణం కేసీఆరే అన్నారు.

పార్టీలో మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌డీ) చైర్మన్‌గా ఉండి ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కుదరదని చంద్రబాబుతో చెప్పించారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందనే విషయాన్ని వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లోనే స్పష్టం చేశామన్నారు. ఉచిత విద్యుత్‌ పేరుతో కేసీఆర్‌ చేస్తున్న అక్రమాలను అమెరికాలో ‘తానా’ సభల్లో వివరించే ప్రయత్నం చేశానని చెప్పారు.

తన మాటలను ఎడిట్‌ చేసి తమకు అనుకూలంగా మలచుకొని మంత్రి కేటీఆర్‌ ట్రోల్‌ చేయించారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌దేనని, 2004కు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేసి, అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ అమలు చేశారని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌తోపాటుఇన్‌పుట్‌ సబ్సిడీ, రుణ మాఫీ ఇచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

వినియోగం ప్రాతిపదికన విద్యుత్‌ పంపకాలు
రాష్ట్ర విభజన సందర్భంగా జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన విద్యుత్‌ పంపకాలు జరపాలని సోనియాను జైపాల్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎంపీలు ఒప్పించారని రేవంత్‌ చెప్పారు. అలా తెలంగాణకు 53శాతం..  ఏపీకి 47 శాతం విద్యుత్‌ ఇచ్చారన్నారు. దమ్ముంటే కేటీఆర్‌ తనతో కలిసి దుక్కి దున్నాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల విద్యుత్‌ సరఫరా కావడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన సవాల్‌ను విద్యుత్‌ శాఖ మంత్రి స్వీకరించలేదన్నారు.

ఉచిత విద్యుత్‌ పేరుతో కేసీఆర్‌ అక్రమాలు
సీఎం కేసీఆర్‌ 24 గంటల విద్యుత్‌ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్‌ ఆరోపించారు. అవసరానికి సరిపడా విద్యుత్‌ కొనడం లేదని విమర్శించారు. కేంద్రం సూచనలను పెడచెవిన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 4వేల మెగావాట్ల కోసం రూ. 40వేల కోట్ల అప్పు చేసిందన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు, ఉచిత విద్యుత్‌ పేరిట చేస్తున్న మోసాల మీద చర్చకు సిద్ధమన్నారు.

రాష్ట్రంలో సంవత్సరానికి 20వేల మిలియన్‌ యూనిట్లను ఉచితంగా ఇస్తూ ప్రభుత్వం రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు కేసీఆర్‌ చెబుతున్నారని, అయితే, ఇందులో రూ.8వేల కోట్లు కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. రైతులకు 24 గంటల ఉచిత ఇచ్చే అంశంపై సెప్టెంబర్‌ 17న తమ మేనిఫెస్టోలో ప్రకటిస్తామన్నారు. 

80 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు
వ్యవసాయ మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లుబిగించబోతోందని, ఈ మేరకు కేంద్రంతో ఒప్పందం చేసుకుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 80 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఓడిపోతారని కేసీఆర్‌ సర్వేలో తేలిందన్నారు. ఆయన గజ్వేల్‌లో గెలుస్తారన్న గ్యారంటీ కూడా లేదని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్‌పై గతంలో సీబీఐ విచారణ కోరిన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement