
సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. సర్వేలో ఎవరు ముందుంటే వారికే సీటు అని క్లారిటీ ఇచ్చారు. కల్వకుంట్ల కవితది ఆస్తుల పంచాయతీ.. ఆమెకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉందని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏడాది కాలంలో ఎంతో పని చేశాం. గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం బాగా జరుగుతోంది. సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం. జూబ్లీహిల్స్‌లో సామాజికవర్గం కాకుండా గెలుపు లక్ష్యం. నియోజకవర్గంలో సర్వేలు జరుగుతున్నాయి. సర్వేల్లో ఎవరు ముందుంటే వారికే టికెట్ దక్కుతుంది. అక్టోబర్ నాలుగో తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే ఒక్కరోజులో బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపొచ్చు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైన సీబీఐ విచారణ జరిపితే బాగుంటుంది.
కవితది ఆస్తుల పంచాయతీ. కాంగ్రెస్‌తో కవితకు ఏంటి సంబంధం. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉంది?. దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు, అందరి వాయిస్‌లు రికార్డు చేశారు. నాది, రేవంత్ రెడ్డిది రెండున్నర ఏళ్ల నుంచి గత ప్రభుత్వం రికార్డు చేసింది. నేను వాడిన జియో సిమ్ కార్డు నెంబర్ జియో సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చింది. జియో సంస్థకు రాసిన లేఖ కూడా దొరికింది. ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు. క్లియర్ ఆధారాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు.