తెలంగాణను ఫిరాయింపుల రాష్ట్రంగా మార్చారు.. కేసీఆర్‌పై రేవంత్‌ ధ్వజం | Sakshi
Sakshi News home page

తెలంగాణను ఫిరాయింపుల రాష్ట్రంగా మార్చారు.. సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ ధ్వజం

Published Tue, Aug 30 2022 2:02 AM

TPCC Chief Revanth Reddy Slams On CM KCR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యమ సెంటిమెంటు ద్వారా అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ తెలంగాణను పార్టీ ఫిరాయింపుల రాష్ట్రంగా మార్చారని... అవినీతి, అత్యాచారాలు, అరాచకాలకు రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. అలాగే బీజేపీ సైతం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు, 8 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసేందుకు రూ. 6,300 కోట్లు వినియోగించిందని ఆరోపించారు.    

అంత డబ్బు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందని రేవంత్‌ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ వల్ల దేశం, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి ఈ రెండు ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరించేలా.. ఈ నాయకులను ప్రజాజీవితం నుంచి బహిష్కరించేలా కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణతో ముందుకెళ్తుందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రాంతీయ ప్రభుత్వాలను పడగొట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలనుకుంటున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ చేస్తున్న భారత్‌ జోడో పాదయాత్రలో తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా పాల్గొంటారని చెప్పారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జీలతో జరిగిన భారత్‌ జోడో సమావేశంలో రేవంత్‌రెడ్డి, మాణిక్కం ఠాగూర్, శైలజానాథ్‌ పాల్గొన్నారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. 

బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తెర దించాలని... 
పార్టీ ఫిరాయింపులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ... ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యక్తిగత బలహీనతలపై బ్లాక్‌మెయిల్‌ చేసి, లొంగదీసు కొని ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడ గొడు తున్న విధానానికి స్వస్తి పలకాలన్న అంశాన్ని సైతం రాహుల్‌ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్తారని రేవంత్‌ వివరించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా ప్రజలను రెచ్చ గొట్టి మతవిద్వేషాల ద్వారా విభజన రేఖను తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని  ఆరోపించారు. 2024లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుందని, కోట్లాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు రాష్ట్రాలలో శాంతిభద్రతలను కాపాడుతుందన్నారు. 

తెలంగాణలో 370 కి.మీ. మేర రాహుల్‌ పాదయాత్ర... 
భారత్‌ జోడో యాత్రతోపాటు సెప్టెంబర్‌ 4న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరగనున్న నిరసన కార్యక్రమం గురించి సమీక్ష జరిగిందని రేవంత్‌ చెప్పారు. సెప్టెంబర్‌ 7న ప్రారంభమయ్యే రాహుల్‌ భారత్‌ జోడో పాదయాత్రలో తెలంగాణ క్రియాశీల భాగస్వామ్యం తీసుకొనే విధంగా సమావేశంలో సూచనలు చేశారన్నారు. తెలంగాణలో దాదాపు 15 రోజులపాటు 370 కి.మీ. మేర రాహుల్‌ పాదయాత్ర చేయబోతున్నారని రేవంత్‌ తెలిపారు. రాష్ట్రంలో పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపైనా సమీక్ష జరిగిందన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement