బీజేపీకి మిత్తితో సహా చెల్లిస్తాం | Telangana: Revanth Reddy Comments On BJP | Sakshi
Sakshi News home page

బీజేపీకి మిత్తితో సహా చెల్లిస్తాం

Jun 15 2022 3:21 AM | Updated on Jun 15 2022 3:21 AM

Telangana: Revanth Reddy Comments On BJP - Sakshi

మంగళవారం అర్ధరాత్రి గాంధీభవన్‌లో ఆందోళన కొనసాగిస్తున్న రేవంత్, జగ్గారెడ్డి తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీకి పట్టుకుందని, అందుకే మూసేసిన కేసులో సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసులి చ్చిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక విషయంలో తప్పేమీ లేదని.. కావాలని మానసిక వేదన కలిగించడం తప్ప చేసేదేం లేదని బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యా లయం ముందు టీపీసీసీ ఆందోళన చేపట్టింది.  రేవంత్‌ మాట్లాడారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా మానవరూపంలోని మృగాలని.. దేశ 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత బరితెగించిన ప్రధాని ఎప్పుడూ లేరని వ్యాఖ్యానించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని దర్యాప్తు సంస్థల అధికారులు గుర్తించాలని స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ 300 సీట్లతో అధికారంలోకి వస్తుందని, అప్పుడు మిత్తితో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. బీజేపీ సర్కారు తీరు మార్చుకోకుంటే.. ఈ నెల 23న ఢిల్లీలోని ఈడీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

గాంధీ కుటుంబాన్ని రాజకీయ హత్య చేసే ప్రయత్నం: జగ్గారెడ్డి 
దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని విచారణల పేరుతో వేధించడం దారుణమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సోనియా, రాహుల్‌లకు పదవులు లేకపోయినా చరిష్మా ఉందని.. మోదీ ప్రధాని పదవి పోయాక రోడ్డుపై నడిస్తే ఆయన చెంచాగాళ్లు తప్ప ఎవరూ పక్కన ఉండరని వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, వేం నరేందర్‌రెడ్డి, బల్మూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 

ఉండవల్లితో భేటీ హనీట్రాప్‌!: రేవంత్‌ 
కేసీఆర్‌తో ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ భేటీకావడం హనీ ట్రాప్‌ వంటిదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పంచన చేరి భజన చేయడంతో ఉండవల్లికి తెలంగాణ ప్రజల్లో ఉన్న గౌరవం కాస్తా పోయిందన్నారు. కేసీఆర్‌ నిజంగా బీజేపీపై పోరాడితే.. ఆయన అవినీతిపై బీజేపీ ఎం దుకు విచారణ జరపడం లేదని.. ఇంత చిన్న లాజిక్‌ను ఉండవల్లి ఎలా మర్చిపోయారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్‌ దగ్గరకు తీయడం ఏమిటని ప్రశ్నించారు.  

ఆందోళన.. తోపులాట 
కాంగ్రెస్‌ నేతలు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈడీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. సాయంత్రం తర్వాత కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ ఆందోళనను గాంధీభవన్‌కు మార్చారు. రేవంత్‌రెడ్డి,  జగ్గారెడ్డి, పార్టీ నేతలు గాంధీభవన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement