ఎవరిని మభ్య పెట్టడానికి దీక్ష?

Telangana: Minister Niranjan Reddy Comments Over Bandi Sanjay Deeksha - Sakshi

బండి సంజయ్‌ని నిలదీసిన మంత్రి నిరంజన్‌రెడ్డి  

కేంద్రం ధాన్యం కొనేదాకా దీక్షలు చేయండి 

రైతుల విషయంలో కేంద్రానిది రెండు నాల్కల ధోరణి 

కేంద్రం నుంచి ప్రకటన తెప్పిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఎవరిని మభ్య పెట్టడానికి బండి సంజయ్‌ దీక్ష చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నిలదీశారు. బీజేపీ థర్డ్‌ క్లాస్‌ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం ప్రతి గింజా కొంటాం అనే దాకా ఆమరణ దీక్ష చేయండని ఎద్దేవా చేశారు. నిరంజన్‌ రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే యాసంగి వడ్లు కొనేలా కేంద్రాన్ని ఒప్పించి లేఖ తీసుకురావాలని అన్నారు.

గురువారం సాయంత్రానికి కేంద్రం నుంచి ప్రకటన తెప్పిస్తే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకే బీజేపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతుల పట్ల ప్రేమ ఉంటే, వారు మొనగాళ్లే అయితే తన చాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. బండి సంజయ్‌ ప్రచారం కోసం ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం కొంటాం అంటే తెలంగాణ ప్రభుత్వం వద్దందా అని ప్రశ్నించారు.  

సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రిని కలిసినా.. 
సీఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి మాట్లాడిన తరువాత కూడా బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వొద్దని పౌరసరఫరాల కమిషనర్‌కు లేఖలు పంపించారని నిరంజన్‌ రెడ్డి చెప్పారు. 60 లక్షల మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. 63 లక్షల ఎకరాలు వరి సాగైందని చెబితే.. ఇంత ఎట్లా వేస్తారని, శాటిలైట్‌లో అంత చూపించడం లేదని గోయల్‌ అనుమానం వ్యక్తంచేశారని తెలిపారు. కేంద్రానికి నచ్చిన గ్రామాల్లో రహస్యంగా సర్వే చేసి వరి సాగును నిర్ధారించుకోమని చెప్పామన్నారు.

నిల్వలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనలేమని నిస్సిగ్గుగా చెప్పారని ధ్వజమెత్తారు. రైతులకు ఉచిత విద్యుత్‌కు రూ.10 వేల కోట్లు, రైతుబంధుకు రూ.15 వేల కోట్లు ఇస్తున్నామన్నారు. ‘వానాకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోళ్లు జరుపుతున్నాం. వానాకాలం 1.35 కోట్ల టన్నుల వడ్లు కొనాలని కేంద్రాన్ని కోరాం.

అయితే, 59.70 లక్షల టన్నులు మాత్రమే కొనేందుకు అనుమతించింది’అని ఆయన పేర్కొన్నారు. పంట సాగును పరిశీలించాక పూర్తిస్థాయి నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. రైతుల విషయంలో కేంద్రానిది రెండు నాల్కల ధోరణి అని, వారి జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పదవిచ్చి, బాధ్యతనిచ్చి అందలమెక్కించిన కేసీఆర్‌ను బొంద పెడతానన్నప్పుడే ఈటల రాజేందర్‌ సంస్కారం బయటపడిందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బహిరంగంగా తప్పులు చేసి దొరికిపోయింది ఈటలే అని అన్నారు. హుజూరాబాద్‌ రైతాంగం బీజేపీ చిల్లర చేష్టలు గమనించి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top