హై కమాండ్‌పై కూడా తిరుగుబాటేనా.. టి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?

Telangana Congress Condition Deteriorating - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. పీసీసీ చీఫ్ మారినప్పటి నుంచి పార్టీలో తిరుగుబాట్లు ఎక్కువవుతున్నాయి. ఇక్కడి నేత మీదే కాదు.. హైకమాండ్‌ మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. టీ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?. కాంగ్రెస్‌ అంటే అంతే.. వచ్చే వాళ్లు వస్తుంటారు. పోయేవాళ్లు పోతుంటారు. తిట్టేవాళ్లు తిడుతుంటారు. కొట్టే వాళ్లు కొడుతుంటారు. అధినేత మాటైనా ఇక్కడ నడవదు.
చదవండి: వచ్చే ఎన్నికల్లో పోటీ.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు: పొంగులేటి

ఎవరిష్టం వాళ్లదే. గీత దాటితే చర్యలు తీసుకుంటామంటారు. అయినా ఎవరూ భయపడరు. కొంతకాలం క్రితం పార్టీ అధినేత స్థాయి నేత రాహుల్‌ గాంధీ తెలంగాణకు వచ్చారు. పార్టీ నేతలు ఎవరు కూడా బహిరంగ విమర్శలు చేయవద్దని, ఏదైనా ఉంటే అంతర్గత సమావేశాల్లోనే మాట్లాడాలని అందరికీ ఆదేశాలిచ్చారు. క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని కూడా రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ఆయన ఆదేశాలు కొద్ది రోజుల్లోనే బేఖాతర్‌ అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ షరా మామూలే.

పార్టీలోని సీనియర్లెవరూ రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా అంగీకరించడం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్రుగా ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి జెల్ల కొట్టారు. రాజగోపాలరెడ్డి అన్న వెంకటరెడ్డి అటు హైకమాండ్‌ మీద, ఇటు రేవంత్‌ మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ వ్యూహరచన కమిటీ సమావేశానికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మధుయాష్కీ డుమ్మా కొట్టారు. వంత్‌ మీద సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నేరుగా దాడి ప్రారంభించారు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు శశిధర్‌రెడ్డి. పాలమూరు జిల్లా జడ్చర్ల పార్టీ ఇన్‌చార్జ్ అనిరుధ్‌రెడ్డి ఓ అడుగు ముందుకేసి ఠాకూర్‌కు రెండు పేజీల ఘాటు లేఖ రాశారు.

జిల్లాల్లో ఎవరికి వారే తాము అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానం అండదండలు తమకే ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో తామే పోటీ చేయబోతున్నామని కనీసం 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ తమకే హామీ ఇచ్చాడని మరికొందరు స్థానికంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అభ్యర్థి ఎవరనే విషయంలో క్యాడర్లోనే సందిగ్ధత ఏర్పడే పరిస్థితి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ చివరి వరకూ స్రవంతి పేరు ప్రకటనను నాన్చారు. 

ఇప్పుడు పార్టీ మీద, రేవంత్‌ మీద బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్న నాయకులంతా సీనియర్లు, ఢిల్లీ పెద్దల దగ్గర పలుకుబడి ఉన్నవారే. రాహుల్‌ గాంధీతో నేరుగా మాట్లాడగలిగినవారే. పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా రచ్చ చేయవద్దని రాహుల్‌ గాంధీ ఆదేశించిన తర్వాత కూడా సీనియర్లు బేఖాతరు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాకూర్‌ వ్యవహార సరళి, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఏకపక్ష ధోరణుల్ని సీనియర్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు వారి మాటలు తెలియచేస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top