ప్రియాంక నామినేషన్‌తో జనసేనలో ముసలం | TDP vs Janasena Alliance Twist in Mamidikuduru | Sakshi
Sakshi News home page

ప్రియాంక నామినేషన్‌తో జనసేనలో ముసలం

Oct 27 2026 11:16 AM | Updated on Oct 27 2026 11:26 AM

TDP vs Janasena Alliance Twist in Mamidikuduru

సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠం కూటమి నేతల మధ్య కొత్త రాజకీయ చిచ్చు రేపుతోంది. పదవి ఒక్కటే.. ఆశావహులు మాత్రం ఐదుగురు. వారిలోనూ నలుగురు ఒకే జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలోకి దిగారు. దీంతో, ఎవరికి అవకాశం దక్కినా మిగిలిన ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. 

జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వం కోసం టీడీపీ నుంచి గొల్లపల్లి అమూల్య, బీర సత్యకుమారి, జనసేన నుంచి పెనుమాల లక్ష్మీ, కొండేటి దేవి ప్రియాంక, బీజేపీ నుంచి మానేపల్లి కృష్ణ శ్రీవల్లి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీరిలో సత్యకుమారి ఐ.పోలవరం జెడ్పీటీసీ నుంచి నామినేషన్‌ వేయగా, మిగిలిన నలుగురూ మామిడికుదురు నుంచే పోటీ చేస్తున్నారు. కూటమి నాయకత్వం ఈ నలుగురిలో ఒకరిని చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎంపిక చేస్తే, మిగిలిన ముగ్గురి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.

 ఒకే స్థానం నుంచి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కూటమి అభ్యర్థులు పోటీలో కొనసాగితే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉండటంతో, చివరకు ఒకరి అభ్యర్థిత్వానికే అగ్రనేతలు మొగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే మిగిలిన వారు పోటీ నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. ఐ.పోలవరం నుంచి పోటీ చేస్తున్న బీర సత్యకుమారికి చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తే మాత్రం మామిడికుదురు నుంచి పోటీ చేస్తున్న నలుగురిలో ఒకరు జెడ్పీటీసీగా మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. 

ప్రియాంక నామినేషన్‌తో జనసేనలో ముసలం
పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమార్తె కొండేటి దేవీ ప్రియాంక మామిడికుదురు జెడ్పీటీసీ స్థానానికి జనసేన తరఫున నామినేషన్‌ దాఖలు చేయడం ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఆమె గుట్టు చప్పుడు కాకుండా నామినేషన్‌ వేసి, తరువాత ఆదివారం ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే పి.గన్నవరం పరిధిలోని నాలుగు మండలాల జనసేన కమిటీలు ఏకమై ప్రియాంకను పార్టీలో చేర్చుకోవద్దంటూ తీర్మానాలు చేసినట్లు సమాచారం. పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఆయన వర్గం కూడా ఆమె అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అనుబంధ సామాజిక మాధ్యమాల్లో కార్యకర్తలు తమ నిరసన తెలియజేస్తున్నారు. తొలి నుంచీ పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి, చివరి నిమిషంలో నామినేషన్ల సమయంలో పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కట్టబెడితే ఎలాగంటూ పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు. ప్రియాంకకు చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వం దక్కినా, పార్టీలో నెలకొన్న వ్యతిరేకత నేపథ్యంలో జెడ్పీటీసీగా ఆమె గెలుపు అంత సులభం కాదని కొందరు కార్యకర్తలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం

బీర అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు
టీడీపీ నుంచి బీర సత్యకుమారి అభ్యర్థిత్వానికి ఆమె వ్యతిరేక వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐ.పోలవరం మండలం నుంచి ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాట్ల సుబ్బరాజు ఉండగా, ఇదే మండలం నుంచి ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్, అమలాపురం ఎంపీగా గంటి హరీష్‌ మాధుర్‌ ఉన్నారు. ఒకే మండలానికి చెందిన వారికి ఇప్పటికే కీలక పదవులు దక్కినప్పుడు, మరో ఉన్నత పదవిని కూడా అదే ప్రాంతానికి కేటాయించడమేమిటని కూటమిలోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement