పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ దాడి | TDP Attacks MP Mithun Reddy In Punganur | Sakshi
Sakshi News home page

పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ దాడి

Jul 18 2024 10:43 AM | Updated on Jul 18 2024 2:03 PM

TDP Attacks MP Mithun Reddy In Punganur

టీడీపీ అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి.

సాక్షి, చిత్తూరు: టీడీపీ అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మాజీ ఎంపీ రెడప్ప నివాసానికి మిథున్‌రెడ్డి రాగా.. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి దిగాయి.

టీడీపీ దాడిలో గాయపడ్డ నేతలతో మిథున్‌రెడ్డి సమావేశం జరుగుతుండగా.. ‘పచ్చ’మూకలు రెచ్చిపోయాయి. రాళ్లతో దాడులకు తెగబడ్డాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టిముట్టిన టీడీపీ గూండాలు.. మీడియా ప్రతినిధులపైనా రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలను కూడా టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు.

చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్‌లోనే దాడులు: మిథున్‌రెడ్డి 
ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘రాళ్లతో మారణాయుధాలతో ఈ రోజు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే ఈరోజు పుంగనూరులో దాడులు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి అడ్డుకోవాలని కుట్రలో భాగమే. 5 వేల కోట్లతో ఎలక్ట్రికల్ కారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే, దాన్ని రాకుండా కుట్రలు చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు, ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించే వాతావరణం లేకుండా దాడులు చేస్తున్నారు. మా వాహనాలు ధ్వంసం చేశారు. ఇప్పటికీ రాళ్లు దాడి చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారు’’ అని మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు.

దాడులు అత్యంత హేయం: ఎంపీ గురుమూర్తి
తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిధున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్య బద్దంగ ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏవిధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని అన్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement