ఒకసారి నువ్వు.. ఒకసారి నేను

TDP leaders Upset Over Chandrababu Naidu Stay in Hyderabad - Sakshi

పెదబాబు, చినబాబు వంతుల వారీగా రాష్ట్ర పర్యటన

ఏపీలోనే ఉండాలని చంద్రబాబుపై పార్టీ క్యాడర్‌ ఒత్తిడి

అయినా అప్పుడప్పుడు వచ్చిన వెళుతున్న బాబు

ఒక వారం తాను వస్తే, మరో వారం కుమారుడిని పంపుతున్న వైనం

ఇలాగైతే ఎలా అంటూ పార్టీలో తీవ్ర అసంతృప్తి 

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ వంతుల వారీగా అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తూ ఏదో ఒక హడావుడి చేసి వెళ్లిపోతుండడంపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్న చంద్రబాబు.. కరోనా విజృంభణ తర్వాత పూర్తిగా అక్కడికే పరిమితమయ్యారు. నెలకో, రెండు నెలలకో ఒకసారి రాష్ట్రానికి వచ్చి జూమ్‌లో ఒకటి, రెండు కాన్ఫరెన్సులు పెట్టి వెళ్లిపోతుండడంపై సీనియర్‌ నాయకులే అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడకు వచ్చినప్పుడు కూడా పార్టీ ముఖ్య నాయకులను కలవక పోవడం, ఇక్కడి నుంచి కూడా ఆన్‌లైన్‌లో మాట్లాడుతుండడంపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ సమావేశాల్లో పలుమార్లు అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్లు ఈ విషయాన్ని లేవనెత్తి ప్రశ్నించారు. పార్టీ అధినేత రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్‌లో ఉండడం వల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని, ఈ పద్ధతి సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.('ఇద్దరూ తలుపులు బిగించుకొని ఇంట్లో దాక్కున్నారు') 

ఇప్పుడు లోకేష్‌ వంతు
పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రతివారం తానుగానీ, తన కుమారుడు గానీ రాష్ట్రానికి వస్తామని చంద్రబాబు పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఒక వారం చంద్రబాబు ఉండవల్లి వస్తే మరోవారం లోకేష్‌ వస్తున్నారు. గత వారం చంద్రబాబు వచ్చి నాలుగు రోజులు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నారు. అప్పుడు కూడా నాయకులు ఎవరినీ ఆయన దరిదాపుల్లోకి వెళ్లనీయలేదు. ఆన్‌లైన్‌లోనే సమావేశాలు నిర్వహించి దీపావళి ముందు హైదరాబాద్‌ వెళ్లిపోయి తన వంతు పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన కుమారుడు లోకేష్‌ వంతు రావడంతో మంగళవారం వచ్చారు. ఆయన రెండు రోజులు ఉండి ఏదో ఒక టూర్‌ పెట్టుకుని మళ్లీ వెళ్లిపోయేలా ప్రణాళిక రూపొందించారు. 20 రోజుల క్రితం తన వంతులో భాగంగా లోకేష్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల బలవంతం మీద అతికష్టంగా పర్యటించారు. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్‌ వెళ్లిపోయి చాలా రోజులు రాలేదు. మళ్లీ ఇప్పుడే వచ్చారు. ఈయన వంతు పూర్తయ్యాక ఆ తర్వాత వారమో, రెండో వారమో చంద్రబాబు వస్తారని పార్టీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. (బాబు, లోకేష్‌ కనబడుట లేదు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top